జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం | Sakshi
Sakshi News home page

జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం

Published Thu, Oct 15 2015 1:32 AM

జనవరి నుంచి ఫైళ్లు బహిర్గతం - Sakshi

నేతాజీ కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ హామీ
* జనవరి 23 బోస్ జయంతి నుంచి ఒక్కో రహస్యం బట్టబయలు
* చరిత్రను అణచిపెట్టాల్సిన అవసరం లేదు
* నన్ను మీ కుటుంబ సభ్యుడిగా చూడండి
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి ఏడు దశాబ్దాలుగా అణచివేతకు గురైన రహస్యాలు బట్టబయలు కానున్నాయి. 1945 ఆగస్టు 18న అకస్మాత్తుగా నేతాజీ అదృశ్యమైన ఘటన వెనుక దాగిఉన్న అతి రహస్యమేదో జాతికి వెల్లడి కానుంది.

2016 జనవరి 23 నుంచి నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక్కో రహస్యఫైలును బయటపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అధికారికంగా ప్రకటించారు. సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన 35 మంది సభ్యులు ప్రధానితో ఆయన అధికార నివాసం 7, రేస్‌కోర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, చరిత్రను అణచిపెట్టి ఉంచాల్సిన అవసరం ఇక ఎంతమాత్రం లేదని అన్నారు. నేతాజీకి సంబంధించి విదేశాల్లో ఉన్న ఫైళ్లను కూడా బహిర్గతం చేయాల్సిందిగా ఆయా దేశాల ప్రభుత్వాలను కోరతామని మోదీ తెలిపారు.

ఈ మేరకు వివిధ దేశాల ప్రభుత్వాలకు తాను వ్యక్తిగతంగా లేఖలు రాయటమే కాకుండా.. ఆయా దేశాధినేతలతో జరిగే సమావేశాల్లో ప్రత్యేకంగా కోరనున్నట్లు మోదీ చెప్పారు.  డిసెంబర్‌లో రష్యా నేతలతో సమావేశమయ్యే సందర్భంలో బోస్ ఫైళ్లను బహిర్గతం చేయాలని కోరతానన్నారు. 2016 జనవరి 23 నేతాజీ జయంతి సందర్భంగా ఆయన రహస్యాల వెల్లడి ప్రక్రియ ప్రారంభమవుతుందని మోదీ స్పష్టం చేశారు. బోస్ కుటుంబ సభ్యులతో దాదాపు గంటసేపు ప్రధాని సమావేశమయ్యారు. ‘‘చరిత్రను అణచివేయాల్సిన అవసరం లేనే లేదు.

చరిత్రను మరచిపోయే దేశాలు చరిత్రను సృష్టించలేవు’’ అని బోస్ కుటుంబంతో భేటీ అనంతరం మోదీ ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. తనను వారి కుటుంబ సభ్యుడిగానే పరిగణించాలని నేతాజీ కుటుంబాన్ని కోరినట్లు మోదీ మరో ట్వీట్‌లో తెలిపారు. నేతాజీ కుటుంబానికి తన నివాసంలో ఆతిథ్యమివ్వటం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. 2014 జూన్‌లో మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత  బోస్ రహస్యాలు బయటపెట్టాలన్న డిమాండ్లు పెరిగిన సంగతి తెలిసిందే. మోదీ ముందు దేశాన్ని పాలించిన ప్రభుత్వాలన్నీ కూడా బోస్ ఫైళ్లను బహిర్గత పరచటానికి నిరాకరిస్తూ వచ్చాయి.

అలా చేస్తే వివిధ దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతింటాయని కూడా వాదిస్తూ వచ్చాయి. మోదీ ప్రభుత్వం కూడా గత ఆగస్టు వరకూ ఇదే వాదన వినిపించింది. అదే సమయంలో నేతాజీ కుటుంబ సభ్యులు కేంద్రం దగ్గర ఉన్న ఫైళ్లను కూడా బహిర్గత పరచాలన్న  స్వరాన్ని పెంచుతూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత నెల(సెప్టెంబర్ 18న) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రజల ముందుంచింది. ఆ తరువాత రెండు రోజులకే(సెప్టెంబర్ 20) ప్రధాని మోదీ తన నెలవారీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో తాను అక్టోబర్‌లో నేతాజీ కుటుంబ సభ్యులను కలుస్తున్నట్లుగా ప్రకటించారు.

బుధవారం నేతాజీ కుటుంబసభ్యులతో భేటీలో రహస్య ఫైళ్ల విడుదలపై మోదీ స్పష్టతనిచ్చారు. ఈ భేటీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నేతాజీకి సంబంధించిన ఫైళ్లతో పాటు విదేశీ ప్రభుత్వాల దగ్గర ఉన్న ఫైళ్లను కూడా ప్రపంచం ముందుంచేలా చొరవ తీసుకోవాలని బోస్ కుటుంబసభ్యులు మోదీని కోరినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. తన ఆలోచనలు, తన ప్రభుత్వ ఆలోచనలతో నేతాజీ కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా కలుస్తున్నాయని మోదీ అన్నారని పేర్కొంది. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నేతాజీని గుర్తుచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని మోదీ అన్నారని ఆ ప్రకటనలో తెలిపారు.
 
కుటుంబం హర్షం.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెట్టాలన్న ప్రధాని  ప్రకటనపై బోస్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశానికి ఈరోజే అసలైన స్వాతంత్య్రం సిద్ధించిన రోజని నేతాజీ మునిమనుమడు చంద్రకుమార్ బోస్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 23నుంచి బోస్ అదృశ్య రహస్యాలను ఆవిష్కరిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. అంతకుముందున్న ప్రభుత్వాలు వీటిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తే.. ప్రధాని మోదీ ఈ రహస్యాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చంద్రకుమార్ ప్రశంసించారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా మోదీ  చొరవను అభినందించారు.

Advertisement
Advertisement