నేటి నుంచి సభా సమరం | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సభా సమరం

Published Thu, Nov 26 2015 3:06 AM

నేటి నుంచి సభా సమరం - Sakshi

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ‘అసహనం’ సెగ
♦ పార్లమెంట్‌లో తీర్మానం చేయాలని పట్టుబట్టే అవకాశం
♦ అసహనంతో పాటు అన్ని అంశాలపై చర్చకు సిద్ధం
♦ అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం
 
 న్యూఢిల్లీ: గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ‘అసహనం’ అంశం సెగ పుట్టించనుంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘అసహనం’ను పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఘటనలను ఖండిస్తూ ఒక తీర్మానం చేయాలని పట్టుబట్టే వీలుంది. సంస్కరణలకు ఊతమిచ్చే వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) సహా పలు కీలక బిల్లులను ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. పార్లమెంట్ సజావుగా సాగేందుకుగానూ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. అసహనంపై నటుడు ఆమిర్‌ఖాన్ వ్యాఖ్యలు, రచయితలు,  సినీ ప్రముఖులు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేసిన నేపథ్యంలో ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అసహనం సహా అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్య ప్రకటించారు. ప్రతిపక్షాల ఆందోళనలను పరిగణిస్తామని, జీఎస్టీపై కాంగ్రెస్‌తో చర్చిస్తామని జైట్లీ ప్రకటించారు. సమావేశానికి హాజరైన ప్రధాని మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకుగానూ పార్లమెంట్ అర్థవంతంగా సాగేందుకు అన్ని పక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎవరేమన్నారంటే..

► అసహనానికి సంబంధించిన ఘటనలను ఖండిస్తూ ఏక వాక్య తీర్మానం చేయాలని రాజ్యసభలో నోటీసు ఇచ్చా.     - ఏచూరి
► సంస్కరణలకు సంబంధించిన అంశాలకు మద్దతు ఇస్తాం.     - శరద్ యాదవ్
► {పస్తుతం జరుగుతున్న పరిణామాలు కలవరం రేపుతున్నాయి. పార్లమెంట్‌లో అసహనం అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతాం.      - బెంగళూరులో రాహుల్ గాంధీ
► సమావేశంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాం. అఖిలపక్ష సమావేశంలో జీఎస్‌టీ బిల్లుకు పూర్తి మద్దతు లభించింది, బిల్లుకు తాము అనుకూలమని కాంగ్రెస్ కూడా స్పష్టం చేసింది.     - వెంకయ్య

 డిసెంబర్ 23 వరకూ జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏడు కొత్త బిల్లులతో పాటు 38 అంశాలు సభ  ముందుకు రానున్నాయి. ఇందులో జీఎస్‌టీతో సహా 24 అంశాలు కీలకమైనవిగా ప్రభుత్వం భావిస్తోంది. బిల్లుల ఆమోదానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరినట్టు వెంకయ్య తెలిపారు. మరోవైపు జీఎస్టీ మీద చర్చకు తాము సిద్ధమని కాంగ్రెస్ బుధవారం ప్రకటించింది.
 
 నేడు భారత రాజ్యాంగ దినోత్సవం
 నేడు భారత రాజ్యాంగ దినోత్సవం. సరిగ్గా 66 సంవత్సరాల క్రితం 1949లో ఇదే రోజు  దేశంలో విభిన్నమైన రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక చరిత్రల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ భారత రాజ్యాంగ సభ రూపొందించిన రాజ్యాంగం ఆమోదం పొందింది. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఎంతోమంది రాజనీతిజ్ఞులు, మేధావులు దీని నిర్మాణంలో తమ మేధను కాచి వడపోశారు. స్వాతంత్య్రానంతర భారత తొలి ప్రభుత్వంలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగ సభకు చైర్మన్‌గా వ్యవహరించారు. 

న్యాయనిపుణుడు బెనెగల్ నర్సింగ్ రాజు.. వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఒక ముసాయిదా డ్రాఫ్ట్‌ను రూపొందించారు. దాదాపు 35మంది సభ్యుల పరిశ్రమతో.. అంబేడ్కర్ దార్శనికతతో రూపొందించుకున్న రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించుకున్నాం. అందుకే ఈ రోజును భారత రాజ్యంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తొలి రెండు రోజులు ఇదే అంశంపై చర్చ జరగనుంది. ఈ రెండు రోజులు కూడా పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ఇతర శాసన సంబంధ కార్యక్రమాలు జరగవు. అంబేడ్కర్ 125వ జయంతి సంవత్సరం కూడా కావటంతో పార్లమెంట్ రాజ్యాంగ నిర్మాతను స్మరించుకోనుంది.
 
 జీఎస్‌టీ బిల్లుకు సహకరించండి: ప్రధాని
 సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మోదీ కోరారు. జీఎస్‌టీ బిల్లు త్వరగా ఆమోదం పొందేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. అఖిలపక్ష సమావేశంలో మోదీ మాట్లాడారు. సంస్కరణలకు ఉద్దేశించి ప్రతిపక్ష నేతలకు అభ్యంతరాలుంటే వాటిని జైట్లీ నివృత్తి చేస్తారన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అందరి సహకారంతో పార్లమెంట్ అర్థవంతంగా సాగాలని ప్రధాని ఆకాంక్షించారు. వాతావరణ మార్పుల అంశానికి సంబంధించి భారత వైఖరిని వెల్లడించేందుకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్ని పార్టీల నేతలతో మాట్లాడతారని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement