జిగ్నేశ్ షా దెబ్బతో ఎఫ్‌టీఐఎల్ ఢమాల్ | Sakshi
Sakshi News home page

జిగ్నేశ్ షా దెబ్బతో ఎఫ్‌టీఐఎల్ ఢమాల్

Published Wed, Jul 20 2016 3:34 PM

జిగ్నేశ్ షా దెబ్బతో ఎఫ్‌టీఐఎల్ ఢమాల్

జిగ్నేశ్ షా ప్రమోటడ్ కంపెనీ ఫైనాన్సియల్ టెక్నాలజీస్(ఎఫ్‌టీఐఎల్) ఆస్తుల అటాచ్ మెంట్ తో, ఆ కంపెనీ కౌంటర్లో షేర్ల అమ్మకం ఊపందుకుంది.ఎఫ్టీఐఎల్ షేరు దాదాపు 17.5 శాతం క్షీణించి, 52 కనిష్టానికి దిగజారింది. ప్రస్తుతం షేరు ధర రూ.70.65గా నమోదవుతోంది. తాజాగా ముంబై ఆర్థిక నేరాల విభాగం ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు చెందిన రూ.2,000 కోట్ల స్థిరాస్తులను స్వాధీన పరుచుకుంది. కంపెనీ బ్యాంకు బ్యాలన్స్ ను ఆర్థిక నేరాల విభాగం అటాచ్ చేసింది. ఎఫ్‌టీఐఎల్ కు చెందిన అన్ని కార్యాలయాలను ఈ విభాగం స్వాధీనం చేసుకుంటోంది. జిగ్నేశ్ షా అరెస్టు నేపథ్యంలో దిగజారిన షేర్ల పతనం, ఆయన కంపెనీ ఆస్తుల అటాచ్ మెంట్ తో మరింత కుప్పకూలుతున్నాయి.

ఇన్వెస్టర్ల పెట్టుబడుల చెల్లింపుల్లో విఫలమైన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్‌ జిగ్నేశ్‌ షాను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. రూ.5,600 కోట్ల ‌ఇన్వెస్టర్ల మనీకి నష్టంవాటిల్లేలా చేశారని, ఈ కుంభకోణ పరిశోధనకు ఆయన సరిగ్గా సహకరించనందున షాను అరెస్టు చేశామని ఈడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జిగ్నేశ్ షాపై విచారణ కొనసాగుతోంది. ఎఫ్టీఐఎల్ లో దాదాపు 63వేల మంది షేర్ హోల్డర్స్, 1,000మంది ఉద్యోగులున్నారు. షేర్ హోల్డర్స్, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని చట్టపరమైన నివారణలు తీసుకుంటామని కంపెనీ చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు ఎన్ఎస్ఈఎల్ సబ్సిడరీ.

Advertisement
Advertisement