ఫోన్లు ట్యాప్ చేస్తే బయటికొచ్చేది చంద్రబాబు బాగోతాలే : శ్రీకాంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

ఫోన్లు ట్యాప్ చేస్తే బయటికొచ్చేది చంద్రబాబు బాగోతాలే : శ్రీకాంత్‌రెడ్డి

Published Thu, Sep 12 2013 2:07 AM

ఫోన్లు ట్యాప్ చేస్తే బయటికొచ్చేది చంద్రబాబు బాగోతాలే : శ్రీకాంత్‌రెడ్డి

చంద్రబాబు, ఆ పార్టీ నేతల నేరచరిత్ర చెప్పాలంటే సమయమే సరిపోదు
 సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నట్లుగా అందరి ఫోన్లూ ట్యాప్ చేయాలని, అప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు బాగోతాలన్నీ బయటకు వస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ను కాపాడుతున్న చంద్రబాబుకు, టీడీపీ నేతలకు తమను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘గోబెల్స్ ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా యనమల రామకృష్ణుడుకు జగన్‌మోహన్‌రెడ్డి తప్ప మరేమీ కనిపించదు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారు ఏ ఒక్కరోజూ లేఖలు రాసిన దాఖ లాలు లేవు. కానీ, మా నాయకుడిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.
 
 ఫోన్లు ట్యాప్ చేస్తే బండారం బయటపడుతుందని యనమల అంటున్నారు! నిజమే ఆయన చెప్పినట్లు అందరి ఫోన్లూ ట్యాప్ చేస్తే చీకట్లో చిదంబరంతో జరుపుతున్న సంభాషణలన్నీ బయటకొస్తాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు, రాజ్యసభలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు టీడీపీ చేసిన బాగోతాలన్నీ వెలుగులోకి వస్తాయి’’ అని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుగా, జననేతగా ప్రజల్లో జగన్‌కు వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే అక్కసుతో చంద్రబాబు విషప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ ఆరోపించారు. ఏమాత్రం విషయం లేని తన కుమారుడిని ప్రమోట్ చేసుకోవడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల మనోభావాలు తెలియని, కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం ట్విట్టర్‌లో ట్వీట్‌ల పేరుతో చీప్ ట్రిక్స్ చేస్తున్న లోకేష్.. ఒక చవటబ్బాయని విమర్శించారు. లోకేష్‌బాబు గురించి ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు గతంలో అసెంబ్లీ సాక్షిగా గుట్టు రట్టుచేసిన విషయం మరిచారా? అని చంద్రబాబును ప్రశ్నించారు.
 
టీడీపీ నేతలకు బాబే ఆదర్శం!
జగన్‌మోహన్‌రెడ్డిపై గోబెల్స్ ప్రచారం చేస్తున్న చంద్రబాబు నైజమేంటో యావత్ తెలుగు ప్రజానీకానికీ తెలుసని శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి.. పదవిని, పార్టీని లాగేసుకున్న చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హతమార్చి చంద్రబాబు శిష్యుడనిపించుకున్నారని మండిపడ్డారు. ఇటీవలే ‘ఫోరం ఢఫర్ గుడ్ గవర్నెన్స్’ సంస్థ 28 మంది టీడీపీ ఎమ్మెల్యేల నేరచరిత్రను బయటపెట్టిందన్నారు. ‘‘హత్యకేసుల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రశేఖర్, యరపతినేని శ్రీనివాసరావు, కందికుంట వెంకటప్రసాద్, చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. బాలికపై అత్యాచారం కేసులో కోవూరు ఎమ్మెల్యే రామారావు, భూకబ్జా కేసులో సుమన్ రాథోడ్ నిందితులుగా ఉన్నారు. ఇటీవల చీటింగ్ కే సులో అరెస్టయిన సాయిబాబు.. చంద్రబాబుకు, రాజగురువు రామోజీరావుకు అకౌంటెంట్‌గా ఉన్న విషయం వాస్తవం కాదా?’‘ అని శ్రీకాంత్ ప్రశ్నించారు.
 
 తన కేబినేట్‌లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి నకిలీస్టాంపుల కుంభకోణంలో మూడేళ్ల శిక్ష అనుభవించి వచ్చాక తిరిగి పార్టీలోకి చేర్చుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ‘‘పాస్‌పోర్టు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి ఏకంగా మలక్‌పేట్ టికెట్ ఇచ్చారు. పేరం హరిబాబు తీసుకెళ్తున్న కారులో దొరికిన రూ. 7 కోట్లు చంద్రబాబువే అని చెప్పినా.. ఇప్పటిదాకా దానికి లెక్కాపత్రమేలేదు’’ అని పేర్కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు, ఆ పార్టీ నేతల నేరచరితకు సమయమే సరిపోదన్నారు. అందుకే విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు చంద్రబాబును రెండుసార్లు ఛీకొట్టారన్నారు. ‘‘అద్దాల మేడలో ఉండేవారు ఎదుటివారి ఇంటిపై రాళ్లు వేయాలనుకుంటే తన ఇల్లే కూలిపోతుందని మోసం, దగా, కుళ్లు, కుతంత్రాలతో మనసు నిండిన చంద్రబాబు గ్రహించాలి’’ అని సూచించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement