సీఎంకు అవి చిన్న విషయాలట! | Sakshi
Sakshi News home page

సీఎంకు అవి చిన్న విషయాలట!

Published Sun, Sep 18 2016 10:59 AM

సీఎంకు అవి చిన్న విషయాలట!

ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం చేసి.. హతమార్చిన ఘటన, బిర్యానీలో బీఫ్ (పశుమాంసం) కలుపుతున్నారంటూ హోటళ్లపై పోలీసుల దాడి.. ఇవి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు చాలా  చిన్న విషయాలట. రాష్ట్రాన్ని రాజకీయంగా కుదిపేస్తున్న అంశాలపై అడిగిన విలేకరులకు ఆయన దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారు. ఇవి చాలా చిన్న విషయాలని, దేశంలో ఎక్కడైనా జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు.

హర్యానా రాష్ట్రం 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేవాట్ లో అక్కాచెల్లెళ్లపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై సీబీఐ విచారణ డిమాండ్ గురించి విలేకరులు ప్రస్తావించారు. 'ఇవి పెద్దగా పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. ఇలాంటి చిన్నచిన్న వాటిపై నేను దృష్టిపెట్టాను. ఈరోజు హర్యానా స్వర్ణ జయంతి గురించే మాట్లాడాలి' అంటూ దాటవేశారు. విలేకరులు మళ్లీమళ్లీ అడిగితే.. 'స్వర్ణ జయంతి సంబరాలతో పోల్చుకుంటే ఇవి చాలా చిన్న విషయాలు. దేశంలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతాయి' అని ఖట్టర్ చెప్పుకొచ్చారు.

ఆగస్టు 24న మేవాట్ లో ఓ 20 ఏళ్ల యువతి, 14 ఏళ్ల ఆమె కజిన్ సోదరిపై కొందరు దుండగులు సామూహిక లైంగిక దాడి జరిపారు. బాధితుల అత్తమామలను  ఇంట్లో కట్టివేసి వారి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన హర్యానాలో ప్రకంపనలు రేపుతోంది. ఇక మేవాట్ లోనే బీఫ్ బిర్యానీ ఆరోపణలపై ఆవుల రక్షణ టాస్క్ ఫోర్స్ డీఐజీ భారతీ అరోరా, గావ్ సేవా ఆయోగ్ చైర్మన్ భానీ రాం మంగ్లా ఆధ్వర్యంలో హైవేపై ఉన్న హోటల్లపై దాడి చేయడం రాజకీయంగా దుమారం రేపింది. అయినా ఇవి చిన్న విషయాలను కొట్టిపారేస్తూ సీఎం ఖట్టర్ స్పందించడానికి నిరాకరించారు. .

Advertisement
Advertisement