కొత్త విభాగాల్లోకి జెమిని ఎడిబుల్స్ | Sakshi
Sakshi News home page

కొత్త విభాగాల్లోకి జెమిని ఎడిబుల్స్

Published Sat, Oct 3 2015 1:56 AM

కొత్త విభాగాల్లోకి జెమిని ఎడిబుల్స్

ఏడాదిలో రెడీ టు ఈట్, స్పైసెస్
2016లో కొత్తగా మరో రిఫైనరీ
 ‘సాక్షి’తో కంపెనీ ఎండీ {పదీప్ చౌదరి వ్యాఖ్య...
 

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడమ్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) ఆహారోత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. రెడీ టు ఈట్, మసాలా దినుసులు, బేకరీ వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనెల మార్కెట్లో జెఫ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. అలాగే ఆహారోత్పత్తులు, బేకరీ, బిస్కట్స్, చాకొలేట్ తయారీ సంస్థలకు నూనెలు, ఫ్యాట్స్ కూడా కంపెనీ సరఫరా చేస్తోంది. నూతన విభాగాల్లోనూ విజయవంతం కావడానికి బ్రాండ్ ఇమేజ్ దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నట్టు జెఫ్ వ్యవస్థాపకుడు, ఎండీ ప్రదీప్ చౌదరి చెప్పారు. ఆసియాలో వంట నూనెల రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక గ్లోబ్ ఆయిల్ ఇండియా-2015 మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఏడాదిలోగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామన్నారు. వివిధ అంశాలపై ఆయనేమన్నారంటే...

బ్లెండెడ్ ఆయిల్స్‌లోకి...
ప్రస్తుతం ఫ్రీడం బ్రాండ్‌తో సన్‌ఫ్లవర్, సోయా నూనె... ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌తో పామోలిన్, వనస్పతి విక్రయిస్తున్నాం. ఈ నెల్లోనే రైస్ బ్రాన్ ఆయిల్‌ను మార్కెట్లోకి తేబోతున్నాం. అలాగే బ్లెండెడ్ ఆయిల్స్‌లోకి నవంబరులో అడుగుపెడుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో కలిపి నెలకు 10,000 టన్నుల సన్‌ఫ్లవర్ నూనె విక్రయిస్తున్నాం. కర్ణాటకలో పెద్ద ఎత్తున విస్తరించాలని చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ నెలకు 500 టన్నుల నూనె విక్రయిస్తున్నాం. దీన్ని ఏడాదిలో 1,500 టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జెఫ్‌లో మెజారిటీ వాటాను ఇండోనేసియాకు చెందిన అంతర్జాతీయ వ్యవసాయ దిగ్గజం గోల్డెన్ అగ్రి రిసోర్సెస్‌కు విక్రయించాం.

మరో రిఫైనరీ...
ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం, కాకినాడ వద్ద కంపెనీకి రిఫైనరీలున్నాయి. రెండు ప్లాంట్ల సామర్థ్యం రోజుకు 1,150 టన్నులుంది. ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నందున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లోని ఏదైనా పోర్టు సమీపంలో మరో రిఫైనరీని రూ.250 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏడాదిన్నరలో ఈ కొత్త రిఫైనరీని ఏర్పాటు చేస్తాం. 2014-15లో కంపెనీ రూ.1,800 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. వంట నూనెల పరిశ్రమ ఏటా 5 శాతం వృద్ధి చెందుతోంది. మేమైతే 20 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. వచ్చే మూడేళ్లూ ఈ వృద్ధిని కొనసాగిస్తామనే విశ్వాసం ఉంది. దేశంలో ఈ రంగంలో జెఫ్ టాప్-4 స్థానంలో ఉంది. కర్ణాటక మార్కెట్లో పట్టు సాధిస్తే టాప్-3 స్థానానికి చేరుకుంటాం.
 
 

Advertisement
Advertisement