తెలంగాణలో పార్టీ పరిస్థితేంటి? | Sakshi
Sakshi News home page

తెలంగాణలో పార్టీ పరిస్థితేంటి?

Published Thu, Jan 9 2014 2:59 AM

Ghulam Nabi Azad discusses on Telangana Congress

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో తెలంగాణలో పార్టీ పుంజుకుందా?, ప్రజల్లో స్పందన ఎలా ఉంది?, అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా?.. కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ ప్రయత్నించారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం హైదరాబాద్ వచ్చిన ఆజాద్.. సుమారు గంటకు పైగా గాంధీభవన్‌లో గడిపారు.  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి, ఎంపీలు అంజన్‌కుమార్‌యాదవ్, సురేష్‌షెట్కార్, పొన్నం ప్రభాకర్, వీహెచ్, ఎంఏ ఖాన్, మాజీమంత్రులు డీఎల్ రవీంద్రారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఫరీదుద్దీన్‌తోపాటు పలువురు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఆజాద్‌ను కలిశారు. జానారెడ్డి, డీఎస్, తర్వాత డిప్యూటీ సీఎం ఆజాద్‌తో ముఖాముఖి సమావేశమై తెలంగాణలో పార్టీ పరిస్థితిని వివరించారు. వీరు వేర్వేరుగా ఆజాద్‌తో మాట్లాడే సమయంలో బొత్స కూడా బయటే ఉన్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిని ఆరా తీసిన ఆజాద్‌తో ఆ ప్రాంత నేతలు.. గతంలో తాము తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉండేదని, విభజనపై నిర్ణయం తీసుకున్న తరువాత ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నామన్నారు.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే గట్టి నమ్మకం తమకు ఏర్పడిందన్నారు. ఎంపీ సీట్ల విషయానికొస్తే అంజన్‌కుమార్ 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పగా... షెట్కార్ మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా మిగిలిన 16 స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. అంతకుముందు డీఎల్ రవీంద్రారెడ్డి సైతం ఆజాద్‌ని కలిసివెళ్లారు. పార్టీ పరిస్థితి, సీఎం కిరణ్ వల్ల పార్టీకి జరుగుతున్న నష్టంపై డీఎల్ ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే మస్తాన్‌వలీ కూడా ఆజాద్‌ను కలిశారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు హైకమాండ్ దగ్గర గట్టి వ్యూహం ఉందని వారితో ఆజాద్ చెప్పారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క కూడా ఆజాద్‌తో విడిగా సమావేశమయ్యారు. విభజన విషయంలో అసెంబ్లీలో ఏయే పార్టీలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయన్న వివరాలను ఆజాద్ అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.

 రాష్ట్ర పగ్గాలు మళ్లీ ఆజాద్‌కే?
 కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్యతలను మళ్లీ కేంద్రమంత్రి ఆజాద్‌కే అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 2004 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు విషయంలో ఆజాద్ క్రియాశీల పాత్ర పోషించారు. ఇప్పుడు రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదా పొత్తు కుదుర్చుకునే అంశాల్లో ఆజాద్ చొరవ ఉపకరిస్తుందనే ఉద్దేశంతో మళ్లీ ఆయనకే బాధ్యతలు అప్పగించే ఆలోచన హైకమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు అప్పగించవచ్చని సమాచారం. 17న ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశాల తర్వాత ఈ మార్పులు జరగవచ్చని తెలుస్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement