సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి | Sakshi
Sakshi News home page

సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి

Published Wed, Aug 5 2015 1:39 AM

Give irrigation funding for projects

ఏఐబీపీ కింద దేవాదులకు రూ.350 కోట్లు
మిషన్ కాకతీయకు రూ.180 కోట్లు
త్వరగా విడుదల చేయాలంటూ 6న ఢిల్లీకి అధికారులు

 
హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి కేంద్ర పథకాల నుంచి అందాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం(ఏఐబీపీ), మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ(ట్రిపుల్‌ఆర్) కింద రాష్ట్రాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న జల్ క్రాంతి అభియాన్, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన(పీఎంకేఎస్‌వై) నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను రాష్ట్రానికి ఇవ్వాలని కోరేందుకు సిద్ధమైంది. ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి హాజరై నిధుల అంశాన్ని ముందుపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పీఎంకేఎస్‌వై పథకం కింద రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సిద్ధమని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ పథకం అమలుతో పాటు రాష్ట్రాల భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలోని స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్రం వచ్చే గురువారం ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పీఎంకేఎస్‌వై పరిధిలోకే అన్ని కేంద్ర పథకాలను తీసుకొచ్చి నిధుల అవసరాలను గుర్తించేందుకు నిర్ణయించింది.

దీనికి రాష్ట్రం తరఫున అధికారులు హాజరుకానున్నారు. కేంద్రం ముందు పెట్టాల్సిన అంశాలపై కసరత్తు సైతం పూర్తి చేశారు. ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు.. ఏఐబీపీ కింద ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టుకు మూడు విడతలుగా రావాల్సిన నిధులు కలిపి రూ.396 కోట్ల వరకు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని కోరడంతో పాటు,  నిజాంసాగర్ ఆధునికీకరణ, ఎస్సారెస్పీ వరద కాల్వ, కొమరంభీమ్ వంటి ప్రాజెక్టులను కొత్తగా ఏఐబీపీలో చేర్చాలని ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి విన్నవించనుంది. మిషన్ కాకతీయ పనులకు ట్రిపుల్ ఆర్ కింద కేంద్రం రూ.వె య్యి కోట్లు ఇచ్చేందుకు సమ్మతి తెలిపినందున అందులో తొలి విడతగా రూ.180 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరనుంది.
 

Advertisement
Advertisement