దొంగ కడుపులోంచి బయటపడ్డ గొలుసు | Sakshi
Sakshi News home page

దొంగ కడుపులోంచి బయటపడ్డ గొలుసు

Published Wed, Aug 19 2015 6:13 PM

దొంగ కడుపులోంచి బయటపడ్డ గొలుసు

చిలకలగూడ (హైదరాబాద్): చోర కళలో ఆరితేరిన ఓ దొంగ.. పోలీసులకు పట్టుబడతాననే భయంతో తస్కరించిన బంగారు గొలుసును ఏకంగా మింగేశాడు. చివరికి అతడిని పోలీసులు పట్టుకొని గొలుసు తీసేందుకు నానా కష్టాలు పడ్డారు. కొట్టేసిన బంగారు గొలుసును దొంగ గుటుక్కున మింగేయగా... గాంధీ ఆస్పత్రి వైద్యులు దాన్ని బయటకు రప్పించారు. సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రోజుల క్రితం సాయంత్రం వాకింగ్‌కు వెళుతున్న ఓ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును వికాస్ అనే దొంగ తెంపుకుని పరారయ్యాడు. వారాసిగూడ వద్ద పోలీసులు అదే రోజు రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా... అనుమానాస్పదంగా తిరుగుతున్న వికాస్ పట్టుబడ్డాడు.  

విచారిస్తున్న సమయంలోనే జేబులో ఉన్న బంగారు గొలుసును గుటుక్కున మింగేశాడు. దీంతో పోలీసులు అతడిని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించారు. కడుపు కింది భాగంలో గొలుసు ఉన్నట్లు తేలింది. శస్త్రచికిత్స చేసి గొలుసు తీయాలని పోలీసులు అక్కడి వైద్యులను కోరారు. అయితే, ఆపరేషన్ చేస్తే ప్రమాదమని, వారం రోజుల్లో మలద్వారం గుండా గొలుసు బయటకు వస్తుందని వైద్యులు చెప్పారు.  దాంతో వారాసిగూడ పోలీసులు వికాస్‌ను రైల్వే పోలీసులకు అప్పగించారు. వారు కోర్టు అనుమతి మేరకు వికాస్‌ను గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు వికాస్‌కు ఎనీమా  ఇవ్వగా బుధవారం అతడు బంగారు గొలుసును విసర్జించాడు.

Advertisement
Advertisement