మంచి కొలెస్ట్రాల్‌తోనూ ముప్పే! | Sakshi
Sakshi News home page

మంచి కొలెస్ట్రాల్‌తోనూ ముప్పే!

Published Fri, Feb 21 2014 5:12 AM

మంచి కొలెస్ట్రాల్‌తోనూ ముప్పే!

వాషింగ్టన్: శరీరంలో మంచి కొలెస్ట్రాల్ గుండెకు మేలు చేస్తుందని, చెడు కొవ్వు మాత్రం హాని చేస్తుందని గతంలో అనేక పరిశోధన ల్లో తేలింది. అయితే చెడు కొవ్వు(ఎల్‌డీఎల్) మాత్రమే కాదు.. పనిచేయని మంచి కొవ్వు(హెచ్‌డీఎల్)  కూడా గుండెకు ముప్పు తెస్తుందని తాజాగా అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. సాధారణంగా మంచి కొవ్వు రక్తనాళాలు గట్టిపడకుండా చూస్తూ గుండెను కాపాడుతుంది.
 
 అయితే మంచి కొవ్వులో ఉండే అపోలిపోప్రొటీన్ ఏ1(అపోఏ1) అనే ప్రొటీన్ ఆక్సిజన్‌తో కలిసి చర్య జరిపితే గనక.. ఆ మంచి కొవ్వు పనిచేయదని, ఫలితంగా రక్తనాళాలు గట్టిపడి గుండెపోటు, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. గుండె జబ్బులు ఉన్న 627 మంది రోగులపై పరిశోధించిన శాస్త్రవేత్తలు.. పనిచేయని మంచి కొవ్వు ఎంత పెరిగితే అంతగా గుండెకు చేటు తప్పదని కనుగొన్నారు. తమ పరిశోధన ఫలితాల ఆధారంగా గుండెజబ్బులకు కొత్త పరీక్షలు, చికిత్సలు రూపొందించవచ్చని అంటున్నారు.

Advertisement
 
Advertisement