గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రాజెక్టుకు సీటీవో గుడ్ బై | Sakshi
Sakshi News home page

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రాజెక్టుకు సీటీవో గుడ్ బై

Published Mon, Aug 8 2016 6:06 PM

గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ప్రాజెక్టుకు సీటీవో గుడ్ బై

వాహనరంగంలో పెను మార్పులకు నాంది పలుకుతూ.. సిలికాన్ వ్యాలీ రోడ్లపై టెస్టింగ్ పరుగులు తీస్తున్న గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇంకా పూర్తిగా ప్రజల్లోకి రాకముందే  ఆ ప్రాజెక్టు అధికారులు దానికి గుడ్ బై చెబుతున్నారు. దాదాపు ఏడున్నరేళ్లుగా ఈ ప్రాజెక్టుకు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్(సీటీఓ)గా పనిచేసిన క్రిస్ ఉర్మ్ సన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం వెల్లడించారు. ఉర్మ్ సన్ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగడాన్ని గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టు సీఈవో జాన్ క్రాఫ్సిక్, ప్రాజెక్టు అధికార ప్రతినిధి జానీ లూ నిర్ధారించారు. కొత్త ఛాలెంజ్కు తాను సిద్దమవుతున్నట్టు, కానీ తదుపరి ప్రాజెక్టు ఏం చేస్తానన్నది ఇంకా తెలియదని ఉర్మ్ సన్ తెలిపారు.

కొత్త సాహసాలకు క్రిస్ ఉర్మ్ సన్ కు గుడ్ లక్ చెబుతూ ప్రాజెక్టు సీఈవో జాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఏడేళ్ల క్రితం సెల్ఫ్ డ్రైవింగ్ కారు ప్రాజెక్టు ఆలోచన తప్ప తమ దగ్గర ఇంకేమీ లేదని, ఈ ప్రాజెక్టును పరిశోధన అంకం నుంచి కారు తయారీ వరకు అభివృద్ధి చేయడంలో క్రిస్ కీలక పాత్ర పోషించారని జానీ లూ కొనియాడారు. లైఫ్ సేవింగ్ టెక్నాలజీ త్వరలోనే ప్రజల ముందుకు రాబోతుందని లూ ఆనందం వ్యక్తంచేశారు. అయితే ఈ ప్రాజెక్టులో కీలక పదవుల్లో ఉన్న అధికారులు తప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో ఈ ప్రోగ్రామ్కు ప్రొడక్ట్ మేనేజర్గా ఉన్న ఆంథోనీ లెవాన్డౌస్కీ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగారు.అదేవిధంగా ప్రధాన సాప్ట్ వేర్ ఇంజనీర్ జియాజున్ జు, మరొక సాప్ట్ వేర్ డేవ్ ఫెర్గూసన్ లూ ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ ఈ ప్రాజెక్టు కోసం డజన్ మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్టును స్వతంత్ర ప్రతిపత్తి గల కంపెనీగా రూపొందించాలని  గూగుల్ భావిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ కారు యూనిట్ ను ఓ కంపెనీగా ఏర్పాటుచేసేందుకు గూగుల్ సన్నద్ధమవుతుందని అధికారులు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఎక్స్ రీసెర్చ్ లాబోరేటరీ యూనిట్ లో ఒకటిగా ఈ ప్రోగ్రామ్ ఉంది. జూలైలో ఈ ప్రాజెక్టుకు మొదటి జనరల్ కౌన్సిల్ను కూడా నియమించారు. కాలిఫోర్నియా, అరిజోనా, వాషింగ్టన్, టెక్నాస్లో ఈ కారు 1.8 మిలియన్ మైళ్ల వరకు టెస్ట్ డ్రైవ్ కూడా నిర్వహించింది. అయితే ఇంకా పబ్లిక్ లోకి ఎప్పుడు తీసుకొస్తారన్నది గూగుల్ వెల్లడించలేదు.

Advertisement
Advertisement