'పోర్న్'పై నిషేధంకాదు.. పర్యవేక్షణే! | Sakshi
Sakshi News home page

'పోర్న్'పై నిషేధంకాదు.. పర్యవేక్షణే!

Published Tue, Aug 4 2015 8:24 AM

'పోర్న్'పై నిషేధంకాదు.. పర్యవేక్షణే! - Sakshi

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మాదిరి స్వచ్ఛ ఇంటర్నెట్ సాధనకు నడుంకట్టిన మోదీ సర్కారుకు.. ఆ దిశగా తీసుకున్న 857 అశ్లీల వెబ్ సైట్ల నిశేధం నిర్ణయాంపై  సమాజంలోని అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.  పోర్న్ వెబ్‌సైట్లకు అడ్డుకట్టవేస్తే అది వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతుకు కూడా కారణమవుతుందనే వాదన వినవస్తుండటంతో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేయాలనుకుంటోంది.

 

ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్ లో పోర్న్ ను పూర్తిగా నిషేధించకుండా  కేవలం పర్యవేక్షించాలని మాత్రమే భావిస్తున్నది. దీనికోసం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అంబుడ్స్మన్ వ్యవస్థను త్వరలో ఏర్పాటుచేయనుంది. 'ప్రజలపై మోరల్ పోలిసింగ్ చేసే ఉద్దేశం మాకు లేదు, విపరీత పరిణామాలు తలెత్తకముందే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం' అని కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించడం కూడా దిద్దుబాటు చర్యల్లో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

నిషేదం వద్దనేది ఎందుకంటే..
ఒకవేళ ప్రభుత్వ సర్వీసు ప్రొవైడర్ల మేరకైనా అడ్డుకోవాలంటే పోర్న్ వెబ్‌సైట్లతోపాటు వైద్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతవుతుంది. వెబ్ ఫిల్టర్లు కేవలం ‘కీ పదాల’ ఆధారంగా పని చేస్తాయిగనుక ఎయిడ్స్‌కు సంబంధించిన సమాచారం గల్లంతుకావచ్చు. సెక్స్ సమస్యలకు సంబంధించిన వైద్య విజ్ఞానానికి సంబంధించిన సమాచారమూ గల్లంతుకావచ్చు. ‘సెక్స్’ అనే కీ పదాన్ని వెబ్ ఫిల్టర్లు అడ్డుకున్నా వినియోగదారులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండకపోవు. సన్నీ లియోన్ లాంటి స్టార్ల పేర్ల ద్వారా కూడా ఇలాంటి సైట్లకు వెళ్లే మార్గాలు ఉంటాయి.

పోర్న్ వెబ్‌సైట్లను చూసే దేశాల్లో భారత్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉందని 2013 సెప్టెంబర్ నెల నుంచి 2014 సెప్టెంబర్ వరకు జరిపిన సర్వేలో తేలిందని అలెగ్జా తెలియజేసింది. ఈ సైట్లను చూసే ప్రపంచ ప్రజల సరాసరి సగటు 7.6 శాతం ఉండగా, భారత్ ప్రజల సగటు 7.32 శాతం ఉంది.

Advertisement
Advertisement