ఎంతొచ్చినా అమ్మేద్దాం..! | Sakshi
Sakshi News home page

ఎంతొచ్చినా అమ్మేద్దాం..!

Published Sat, Nov 30 2013 3:20 AM

ఎంతొచ్చినా అమ్మేద్దాం..! - Sakshi

‘స్వగృహ’ ఇళ్లు, భూముల ధరలు తగ్గించి అమ్మాలని సర్కారు నిర్ణయం
బేరసారాలకూ వెసులుబాటు..
‘వచ్చిందే చాలు’ తరహాలో అమ్మకం

 
 సాక్షి, హైదరాబాద్: పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఇళ్లు, భూములను వదిలించుకునేందుకు సిద్ధమైంది. ‘వచ్చిందే చాలు’ తరహాలో అపార్ట్‌మెంట్లు, సొంత భూములను ఎంతొచ్చినా అమ్మేయాలని నిర్ణయించింది. ఇంతకాలం నిర్ధారిత ధరలకే వాటిని అమ్మాలనే పద్ధతిలో ముందుకుసాగినా.. కొనేవారు లేకపోవడంతో కార్పొరేషన్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పుడు కొనేవారుంటే చాలు ఎంతొచ్చినా అమ్మేద్దాం.. అనే నిర్ణయానికి వచ్చి ఇదే విషయాన్ని ప్రభుత్వం ముందుంచింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే అంది. కార్పొరేషన్ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ ధరలను ఆధారం చేసుకుని స్వగృహ ఇళ్లు, భూముల ధరలను నిర్ణయించే అధికారాన్ని కార్పొరేషన్ ఎండీకి కట్టబెట్టింది.
 
  మార్కెట్ పరిస్థితుల ఆధారంగా అప్పటికప్పుడు వాటి ధరలను నిర్ధారించే అవకాశం ఇక కార్పొరేషన్ పరిధిలోకే రావటంతో, ప్రజలు బేరసారాలాడే వీలు చిక్కింది. దీంతో అమ్మకాలు కూడా వేగంగా సాగి ఆదాయం సమకూరుతుందనేది ప్రభుత్వ ఆలోచన. వాటితో కేటగిరీ ఒకటి పరిధిలోని పదకొండు ప్రాజెక్టుల్లో పనులు పూర్తి చేయటానికి వీలు చిక్కటమే కాకుండా, బ్యాంకు అప్పులు తీర్చేందుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు రూ. 246 కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement
Advertisement