జీఎస్టీ.. అక్కడ విఫలం, ఇక్కడ అందలం | Sakshi
Sakshi News home page

జీఎస్టీ.. అక్కడ విఫలం, ఇక్కడ అందలం

Published Tue, Jul 4 2017 1:45 AM

జీఎస్టీ.. అక్కడ విఫలం, ఇక్కడ అందలం - Sakshi

రెండో మాట
కొన్ని దేశాల్లో జీఎస్టీకి బదులు మనలాగానే ఇప్పటిదాకా వ్యాట్‌ కొనసాగుతూ ఉంది. కానీ జీఎస్టీ ద్వారా పెక్కు దేశాలు అస్తవ్యస్త పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. దీని జన్మస్థానం ఫ్రాన్స్‌లోను, కెనడాలోనూ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ పన్ను అమలులోకి వచ్చిన తర్వాత కెనడా అనేకసార్లు జీఎస్టీ రేట్లు తగ్గించుకోవలసి వచ్చింది. అయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ భారీ పరోక్ష పన్నుల విధానంవల్ల ఇండియాలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ‘ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌’ అంచనా.

‘భారత ప్రజలు అవినీతిని ఏవగించుకుంటారు. గత మూడేళ్లలోనూ ఈ విషయంలో నా ప్రభుత్వం మీద ఒక్క మచ్చగాని, మరక గాని లేదు. – నరేంద్ర మోదీ (అమెరికా తాజా పర్యటనలో జూన్‌ 26న ఆయన నోటి నుంచి వెలువడిన ఆణిముత్యం, ది హిందూ 27–6–17)

‘ఎన్నికల వ్యయం జమాఖర్చులు చూపకుండా తప్పుడు లెక్కలు అందించి అవినీతికి పాల్పడిన మధ్యప్రదేశ్‌ (బీజేపీ) మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఎన్నిక చెల్లనేరదని ఎన్నికల సంఘం ప్రకటించింది. శాసనసభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తూ మూడేళ్ల వరకు ఎన్నికలలో పోటీకి అనర్హుడని వెల్లడించింది.’  – (మోదీ ప్రకటనకు ఒకరోజు ముందు వెలువడిన వార్త)

‘భారత పార్లమెంట్‌లో సుమారు వందమందికి పైగా బీజేపీ సభ్యులు అక్రమార్జనపరులు.’  – (భారత్‌ ఎలక్షన్‌ వాచ్‌ సర్వే)

పెద్ద నోట్ల రద్దు వ్యవహారం మాదిరిగానే, అంతే ఆకస్మికంగా అనాలోచి తంగా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని తెచ్చింది. బహుముఖాలుగా, బహుళ స్థాయిలో; ప్రత్యక్షంగా, పరోక్షంగా పన్ను వసూళ్ల కోసం ఇలాంటి అడుగు వేసింది. కాంగ్రెస్‌–యూపీఏ ప్రభుత్వం గత పదిహేనేళ్లలో ఆదరాబాదరాగా ఈ చట్టాన్ని దేశంమీద రుద్దలేక ఆగిపోయిందా? కాదు. భారత పాలకవర్గాలు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న అమెరికాయే జీఎస్టీని తిరస్కరించిన విషయాన్ని గుర్తించాలి. ప్రపంచంలో దాదాపు 150 దేశాలు జీఎస్టీæ ద్వారా ఆదాయ వనరులు పెంచుకుంటున్నాయని మన పాలకవర్గాల భ్రమ. కానీ ఆయా దేశాలలో పాలకవర్గాలు ఎందుకు పతనమైనాయో మాత్రం వారు ఆలోచించడం లేదు. జీఎస్టీని అమలులోకి తెచ్చే ముందు ఆయా దేశాలు ఎన్నేళ్ల పాటు ప్రయోగ దశకే పరిమితం కావలసి వచ్చిందో కూడా వీరికి అవసరం లేదు.

పెద్ద నోట్ల రద్దు తరహాలోనే...
పెద్ద నోట్ల రద్దుతో సామాన్య రైతాంగం, ఉద్యోగులు, చిన్న మధ్య తరగతి వ్యాపారులు, వృత్తుల వారు కుదేలయ్యారు. బ్యాంకులలో ఉన్న తమ పైకాన్ని సయితం తీసుకునే అవకాశం లేక వారు యాతన పడ్డారు. అప్పుడు యూపీ ఎన్నికల కోసం పెద్ద నోట్ల రద్దును ఆదరాబాదరాగా తెచ్చినట్టే, ఇప్పుడు 2018–19 ఎన్నికల కోసం జీఎస్టీని ఎరగా చూపుతున్నారని అనిపిస్తున్నది. ఈ పన్ను విధానం జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని అమలుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ ఇంకా సమకూరలేదు. జీఎస్టీని ప్రవేశపెట్టిన దేశాలు మొదట మూడేళ్లకు మించి ప్రయోగాత్మకంగా అమలు చేసిన సంగతి వాస్తవం. కాంగ్రెస్‌ మీద ఉన్న రాజకీయ కక్షతో ఇలాంటి విధానాన్ని ఎన్డీయే ప్రజల మీద రుద్ది ఉండవలసింది కాదు. అసలు పెద్ద నోట్ల రద్దు నాటకం సత్ఫలితాలను ఇవ్వలేదన్న గుర్రు కూడా ఎన్డీయేకు ఉంది. నోట్ల రద్దుతో ఎన్ని లక్షల కోట్లు ప్రభుత్వ బొక్కసంలో జమ అయినాయో, ఎంత నల్లధనం వెలికితీశారో ప్రభుత్వం ఇంతవరకు నివేదించలేదు. ఈ వైఫల్యం కనిపిస్తూనే ఉంది.

బ్యాంకులలో మదుపు చేసుకున్న తమ సొమ్మును వినియోగించుకునే వీలులేకుండా బంధించిన ప్రభుత్వ చర్యను ప్రతిఘటించడంలో ప్రజానీకం విఫలమైంది. దీనితో ఇప్పుడు జీఎస్టీ దంచుడు ఎజెండాను ఏకపక్షంగా అమలు చేయడానికి ఎన్డీయే సాహసించింది. జీఎస్టీ దంచుడుకు ప్రతిఘటన లేకుండా ఉండేందుకు బడా వ్యాపార వర్గాలు (గుజరాత్‌లో నిరసనలు జరి గాయి) మినహా చిన్న, మధ్య తరగతి వ్యాపారులు, ఇతరులు నోరు మెదపకుండా చట్టంలో తగిన నిబంధనలను కూడా పెట్టుకున్నారు. ఈ జాగ్రత్తలన్నీ ఎందుకు అవసరమైనాయి? నోట్ల రద్దు ప్రక్రియ లక్ష్యం (నల్లధనం వెలికితీత) నెరవేరకపోవడంతో విదేశాలలో, ముఖ్యంగా స్విస్‌ బ్యాంకులలో పనామా పేపర్స్‌ వెల్లడించిన సంస్థలలో మేట వేసుకున్న లక్షల కోట్లాది నల్ల ధనాన్ని వెలికి తీసి భారత దేశానికి రప్పించడంలో విఫలం కావడం వల్లనే కొత్త వాదనను బీజేపీ పాలకులు ఆశ్రయించవలసి వస్తున్నది.

స్విస్‌ నుంచి తిరిగొచ్చిన నల్లధనం ఎంత?
నిన్నటిదాకా వెల్లడి చేయని లక్ష కంపెనీల రిజిస్ట్రేషన్స్‌ను బ్లాక్‌మనీ విషయంలో అనుమానం మీద రద్దు చేసినట్టు జీఎస్టీ ప్రయోగం ప్రారంభ వేళ మోదీ ప్రకటించారు. వాటితోపాటు ‘నోట్ల రద్దు’ అనంతరం అందిన డేటా ప్రకారం 38,000 బినామీ కంపెనీలు బయటపడ్డాయని ప్రకటించారు. ఆ ప్రకటనలోనే కొంత దాపరికం ఉంది. 2014లో ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలి ‘అవినీతి నిరోధక ప్రకటన’లలో స్విస్‌ బ్యాంకుల్లో దాచుకున్న భారతీయుల నల్లధనం మొత్తాన్ని దేశానికి తెప్పిస్తానని మోదీ హామీపడ్డారు. తమ బ్యాంకుల్లో భారతీయుడు కుదువబెట్టిన నల్లధనం రూ. 24 లక్షల కోట్లని స్విస్‌ ప్రభుత్వం వెల్లడించింది. అందులో మనకి వాపసు వచ్చింది ఎంత అన్నది చెప్పలేదు. ‘పేదల్ని దోచుకున్నవాళ్లు ఆ సొమ్మునంతా తిరిగి పేదలకు ఇవ్వాల్సిందే’నని జనరల్‌ ప్రకటన చేశారు, సంతోషిద్దాం. కానీ ఆ దోపిడీదార్లలో గుజరాత్‌ ఆదానీలు, అంబానీలు ఉన్నారో లేదో మనకు తెలీదు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో డిపాజిట్‌ అయిన నోట్లు ఎక్కడినుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎటుపోయాయో తెలియదనీ, ఎవరినీ ఆ విషయం గురించి ప్రశ్నించబోమనీ, కేవలం లెక్కల్ని అలా చూసి వదిలేస్తామనీ మోదీ అన్నారు.

నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కంపెనీల చార్టెర్డ్‌ అకౌంటెంట్లు (సీఏ) ఇంతకుముందు కంటే చాలా బిజీ అయిపోయారనీ, వీరిలో కొందరు అలాంటి అనుమానిత కంపెనీలను ఆదుకోడానికి సాయపడి ఉంటారనీ వ్యంగ్యంగా మాట్లాడారు. స్విస్‌ బ్యాంకుల నుంచి తన ప్రభుత్వం భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించిందో లేదో మాత్రం చెప్పలేకపోయారు. కానీ స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం, మొత్తంమీద 45 శాతం తగ్గిందట. అది తన కృషివల్లనేనని మాత్రం ఆయన చెప్పలేక పోయారు. కాంగ్రెస్‌ హయాంలో 2013లో స్విస్‌ బ్యాంక్‌లో ఈ నల్లధనం బ్యాలెన్స్‌ 42 శాతం దాకా పెరిగిందని చెప్పడం మోదీ అసలు ఉద్దేశం. సమస్యను అలా దారి మళ్లించారు. అంతేగానీ మూడేళ్ల పాలనలో దండోరా వేసినంత వూపులో మోదీ నల్లధనాన్ని స్విస్‌ బ్యాంకు నుంచి వెనక్కి తీసుకొచ్చిన దాఖలాలు దేశం చూడలేదు. కాకపోతే మూడేళ్లు ముగిశాయి, మిగిలిన రెండేళ్లలోపు స్విట్జర్లాండ్‌ బ్యాంకుల్లో ఉన్న తమ నల్లధనాన్ని భారతదేశానికి జమ కట్టకపోతే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవలసి రావచ్చునని ఒక హెచ్చరిక చేసి వదిలారు.

11 ఏళ్లలో కాంగ్రెస్‌ అట, 25మంది చార్టెర్డ్‌ ఎకౌంటెంట్స్‌ (సీఏ) మీద మాత్రమే చర్య తీసుకుందట. దామాషాలో బీజేపీ పాలనలో గత మూడేళ్లలోనూ కనీసం 6–7మంది సీఏలపైనైనా చర్య తీసుకుని ఉండాలి గదా! కోటలు దాటే మాటల్ని ప్రజలు నమ్మరు, గడప దాటని మాటల్నీ నమ్మరు. జీఎస్టీ ప్రయోగాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం, సైబర్‌ నేరాలను, హ్యాకర్స్‌ టాంపరింగ్‌ నేరాలను పరిగణించకుండానే తలపెట్టడం ప్రమాదకర జూదం. ఇందుకు ‘ఒక దేశం, ఒకే పన్ను’ విధానం పేరిట జీఎస్టీ కింద 17 రకాల పాత పన్నుల్ని రద్దు చేసి, 1500 రకాల శ్లాబ్స్‌ను 4 రకాలుగా విడగొట్టి అదనపు భారంగా మోపడం అసలు లక్ష్యం.

జీఎస్టీతో అవ్యవస్థ
జీఎస్టీ కింద కేంద్ర పన్నులు పెరగడమే కాదు, ద్వంద్వ (రెండు రకాల) పన్నుల విధానం ‘ఫెడరల్‌ వ్యవస్థ’ పేరిట రాష్ట్రాలు కూడా అదనంగా పన్నులు పెంచుకోవచ్చు, ఆ మేరకు కేంద్రం తన భారాన్ని దించుకోవచ్చు. ఎందుకంటే, రాజకీయ ప్రయోజనాల కోసం ఫెడరల్‌ వ్యవస్థను ఆచరణలో ఇష్టపడని కేంద్ర పాలకులు పన్నులు మోపడానికి ముందడుగు వేస్తారు. కొన్ని దేశాల్లో జీఎస్టీకి బదులు మనలాగానే ఇప్పటిదాకా వ్యాట్‌ (వాల్యూయాడెడ్‌ ట్యాక్స్‌– విలువ ఆధారిత పన్ను) కొనసాగుతూ ఉంది. కానీ జీఎస్టీ ద్వారా పెక్కు దేశాలు అస్తవ్యస్త పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాయి. దీని   జన్మస్థానం ఫ్రాన్స్‌లోను, కెనడాలోనూ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఈ పన్ను అమలులోకి వచ్చిన తర్వాత కెనడా అనేకసార్లు జీఎస్టీ రేట్లు తగ్గించుకోవలసి వచ్చింది. అయినా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ భారీ పరోక్ష పన్నుల విధానంవల్ల ఇండియాలో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ‘ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌’ అంచనా.

మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అప్పుడే రైళ్లలో టీటీఈలు టికెట్‌కు అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారని వార్తలు. ఫ్రాన్స్‌లో 20 శాతం వద్ద రేటును స్థిరపరిచి 10 శాతానికి కోతపెట్టక తప్పలేదు. బ్రిటన్‌లో స్టాండర్డ్‌ రేటు 20 శాతం కాగా దాన్ని 15 శాతానికి, మలేషియా జీఎస్టీ రేటు 6 శాతానికి, సింగపూర్‌ రేటు 7 శాతానికి కుదించుకోవలసి వచ్చింది. ఈ వాతావరణంలో ఇండియా జీఎస్టీ రేటు 12 శాతం నుంచి 28 శాతానికి ‘హనుమంతుడి తోకలా’ పెరిగిపోయింది. కాగా, జీఎస్టీ రేట్లవల్ల పొంచి ఉన్న మరొక ప్రమాదం– నోట్ల ముమ్మరం/ద్రవ్యోల్బణం. అలాగే జీఎస్టీ వల్ల పన్నుల ఎగవేత నేరాలు తగ్గిపోతాయని మరొక భ్రమ. ఫ్రాన్స్‌ అయినా, అక్కడి కార్పొరేట్లు పన్ను ఎగవేతలు ఎందుకు ఆగిపోలేదు? అమెరికా జీఎస్టీని పాటించకపోయినా, రాష్ట్రాలకు ఆర్థిక విషయాల్లో అత్యంత స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చినందున జీఎస్టీ లేదు. జీఎస్టీ ద్రవ్యోల్బణానికి దారితీయడమేగాక తరచు లీగల్‌ తగాదాలకు దారి తీయవచ్చునని నిపుణుల అంచనా.

మరో చిత్రమైన సంగతేమంటే– జీడీపీని అమలు చేస్తున్న క్రమంలో అంతకుముందు సింగపూర్‌ జాతీయోత్పత్తుల అభివృద్ధి సూచి 1991లో 5.5 శాతం ఉండగా, 1994లో అది 3 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం దంచికొట్టింది. ఫలితంగా ప్రభుత్వ పతనాలు, ప్రజలకు ఇబ్బందులు. జీఎస్టీ కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు కోర్టులదాకా కొన్ని కెనడా రాష్ట్రాల్లో పాకారంటే పాలకుల నిరంకుశ నిర్ణయాలే కారణమై ఉండాలి. మరొక మాటలో చెప్పాలంటే ‘ప్రపంచీకరణ’ విధాన ‘ముసుగు’లో ప్రజా వ్యతిరేక సంస్కరణలకు పునాదులెత్తిన వరల్డ్‌బ్యాంక్, ఐఎంఎఫ్‌ అమెరికా సామ్రాజ్యవాద పాలక సంస్థలే– జీఎస్టీ ద్వారా కార్పొరేట్‌ ప్రయోజనాలను ప్రధానంగా కాపాడ్డానికే ప్రజా బాహుళ్యంపై భారీ పరోక్ష పన్నుల భారాన్ని మోపడానికి కూడా కారణం. అందుకు పబ్లిక్‌ (ప్రభుత్వ) రంగ సంస్థల్ని క్రమంగా పండబెట్టమన్న పరిష్కారమూ ఈ సంస్థల చలవేనని మరచిపోరాదు.


- ఏబీకే ప్రసాద్‌

సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

తప్పక చదవండి

Advertisement