చౌక మద్యంపై పిల్లిమొగ్గలు! | Sakshi
Sakshi News home page

చౌక మద్యంపై పిల్లిమొగ్గలు!

Published Thu, Sep 3 2015 2:22 AM

చౌక మద్యంపై పిల్లిమొగ్గలు! - Sakshi

గుడుంబా నిర్మూలన కోసం ప్రవేశపెడతామన్న సర్కారు
* ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనతో ‘తాత్కాలిక’ వెనకడుగు
* ప్రజల్లో చర్చకు పెట్టి తరువాత అధికారికంగా గ్రామాల్లోకి పంపే యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాను అరికట్టేందుకు ‘చౌక మద్యం’ ప్రవేశపెడతామన్న రాష్ట్ర ప్రభుత్వం.. దీనిపై ప్రతిపక్షాలు, సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో పిల్లిమొగ్గలు వేస్తోంది. ఈ సంవత్సరానికి చౌక మద్యం ఉండదని, పాత చీప్ లిక్కర్ విక్రయాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.

అయితే ఈ ప్రకటన వెనుక ‘గుడుంబాకు బదులు చౌక మద్యం ప్రవేశపెట్టాలి’ అనే రీతిలో ప్రజలను మానసికంగా సిద్ధం చేసే ఆలోచన సర్కారుకు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో మంత్రుల అభిప్రాయాల పేరుతో ‘ఈ సంవత్సరం పాత విధానాన్నే కొనసాగిస్తున్నట్లు’ సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రతిపక్షాలకు ఆయుధం ఇవ్వకుండా ప్రజల్లో చర్చకు పెట్టి.. ఆ తరువాత అనుకున్న విధంగా చౌకమద్యాన్ని రిటైల్ దుకాణాలకు సరఫరా చేసే యోచన ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం విక్రయిస్తున్న చీప్ లిక్కర్‌నే కొంతకాలం పాటు విక్రయించాలని, క్రమక్రమంగా చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని సీఎం సహా ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. అందుకే సీఎం మీడియా సమావేశంలో ఎక్కడా చీప్‌లిక్కర్‌ను తీసుకురావడం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పలేదు. 2016 జూన్ 30 వరకు అంటే 9 నెలలు మాత్రమే మంత్రివర్గం ఆమోదించిన నూతన మద్యం పాలసీ ఆచరణలో ఉంటుంది.
 
మండలం యూనిట్‌కు కారణమదే!
చౌక మద్యం ఆలోచనతోనే మండలాలు యూనిట్‌గా మద్యం పాలసీకి రూపకల్పన జరిగింది. మండలం లెసైన్సు పొందిన వారే గ్రామాల్లో బి-లెసైన్సు దుకాణాలు ఏర్పాటు చేసుకొని విక్రయించుకునే వెసులుబాటు కొత్త విధానంలో లభించనుంది. తద్వారా గుడుంబా విక్రయాలను నిలువరించే పనిని లెసైన్సుదారులకు అప్పగించాలని భావించారు. తాజాగా చౌకమద్యంపై సర్కారు వెనక్కి తగ్గినప్పటికీ మండలం యూనిట్‌గా లెసైన్సు, బి-లెసైన్సు దుకాణాల్లో పాత పద్ధతిలోనే రూ.60, రూ.35 ధరలకే చీప్ లిక్కర్ విక్రయిస్తారు.
 
వెనకడుగు తాత్కాలికమే!

రాష్ట్రంలో గుడుంబాకు విరుగుడుగా చౌకమద్యం ప్రవేశపెడతామని సీఎం 6 నెలలుగా చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల క్రితం రద్దు చేసిన సారాను తెరపైకి తేవాలని తొలుత భావించారు. కానీ దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతుందేమోనన్న భావనతో కొం దరు అధికారులను ఇతర రాష్ట్రాలకు పంపి చౌక మద్యంపై అధ్యయనం చేయించారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో రూ.20 లోపు ధరలో 90ఎంఎల్ మద్యం అందుబాటులో ఉందని తేలడంతో గుడుంబా విక్రయించే ధర(రూ.10)కే మద్యం విక్రయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే అది వీలుకాదని అధికారులు చెప్పడంతో రూ.15కు 90ఎంఎల్ మద్యం అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ పలుమార్లు సీఎం, సీఎస్‌లతో చర్చలు జరిపారు. ఆరు డిస్టిలరీలతో మాట్లాడి అక్టోబర్ ఒకటి కల్లా చీప్‌లిక్కర్‌ను సరఫరా చేసేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే చౌక మద్యంపై కల్లుగీత కార్మిక సంఘాలు, మహిళా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో... ఉన్నతస్థాయిలో చర్చలు జరిపి, చౌక మద్యం అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement