Sakshi News home page

గుర్మీత్‌కు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉపసంహరణ

Published Sat, Aug 26 2017 3:18 PM

గుర్మీత్‌కు జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉపసంహరణ

- జైలులో సాధారణ ఖైదీగానే చూస్తున్నాం: హరియాణ సీఎస్‌
- రాష్ట్రంలో సడలని ఉద్రిక్తత..  భారీగా సైన్యం మోహరింపు
- డేరా ఆశ్రమాలను ఖాళీచేయిస్తోన్న అధికారులు


సిర్సా/ఛండీగఢ్‌: అత్యాచారం కేసులో గుర్మీత్‌ సింగ్‌ రామ్‌ రహీమ్‌ దోషిగా తేలడంతో ఆయనకు కల్పిస్తోన్న జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు హరియాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపిందర్‌ సింగ్‌ చెప్పారు. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆందోళనల్లో ఇప్పటి వరకూ31 మంది చనిపోయారని, 250 మంది గాయపడ్డారని సీఎస్‌ సింగ్‌ తెలిపారు.  శుక్రవారం రాత్రి 15 మంది డేరా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని, ఆయా బృందాలపై రెండు దేశద్రోహం కేసులు పెట్టామని చెప్పారు. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్‌ను హెలికాప్టర్‌లో రోహతక్‌ జైలుకు తరలించామన్న సీఎస్‌.. జైలులో దోషికి వీఐపీ సేవలు అందుతున్నాయన్న వార్తలను ఖండించారు. గుర్మీత్‌ను సాధారణ ఖైదీగానే చూస్తున్నామని, అందరూ తినే ఆహారాన్నే ఆయనకూ అందిస్తున్నామని వివరించారు.

హరియాణాలో సడలని ఉద్రిక్తత: గుర్మీత్‌పై కోర్టు తిర్పు అనంతరం ఉత్తరభారతంలోని ఆరు రాష్ట్రాల్లో డేరా సచ్ఛా సౌధా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. హరియాణ, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లలో శుక్రవారం రాత్రి వరకూ ఉద్రిక్తత కొనసాగింది. అయితే శనివారం మధ్యాహ్నానికల్లా పంజాబ్‌, ఢిల్లీ, యూపీ, హిమాచల్‌, రాజస్థాన్‌ల జిల్లాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆందోళనలూ చోటుచేసుకోనప్పటికీ కర్ఫ్యూను మాత్రం కొనసాగిస్తున్నారు. అయితే, హరియాణాలోని పలు పట్టణాల్లో హింసాయుత ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  ఆందోళనలకు కేంద్ర బిందువులైన పంచకుల, సిర్సా, మన్సా, మన్‌కోట్‌ పట్టణాలకు శనివారం నాటికి పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలు తరలివెళ్లాయి.

డేరా ఆశ్రమాల మూసివేత: హైకోర్టు ఆదేశానుసారం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గుర్మీత్‌కు చెందిన డేరా సచ్ఛా సౌదా ఆశ్రమాలను ఖాళీచేయిస్తున్నారు. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్‌, కైథాల్‌, పంచకుల తదితర పట్టణాల్లోని డేరా ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతోన్న లక్షల మందిని పోలీసు బలగాలు బయటికి పంపేస్తున్నారు. వారిలో మహిళలు, చిన్నపిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో తరలింపు ప్రక్రియ నిదానంగా సాగుతోంది.

డేరా స్వచ్ఛ సౌధా చీఫ్‌ గుర్మీత్‌ 2002లో తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారనే ఆరోపణలు రుజువుకావడంతో పంచకుల సీబీఐ కోర్టు ఆయనను శుక్రవారం దోషిగా నిర్ధారించింది. సోమవారం గుర్మీత్‌కు శిక్షలు ఖరారు కానున్నాయి.

Advertisement
Advertisement