భారత్, చైనాల్లో నీటి కొరత ఎక్కువే | Sakshi
Sakshi News home page

భారత్, చైనాల్లో నీటి కొరత ఎక్కువే

Published Thu, Mar 23 2017 2:05 AM

భారత్, చైనాల్లో నీటి కొరత ఎక్కువే

జల దినోత్సవం సందర్భంగా ఐరాస నివేదిక
పారిస్‌/ఐరాస: ప్రపంచంలోని జనాభాలో మూడింట రెండు వంతుల మంది, ఏడాదికి కనీసం ఒక నెల పాటైనా నీటి కొరత ఉండే ప్రాంతాల్లో నివసిస్తున్నారనీ, ఆ జనాభాలో సగం మంది భారత్, చైనాల్లోనే ఉన్నారని ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదిక ఒకటి పేర్కొంది. వ్యర్థ జలాలను శుద్ధి చేయడం వల్ల నీటి కొరతను అధిగమించడంతోపాటు పర్యావరణాన్ని కూడా రక్షించుకోవచ్చని నివేదిక సూచించింది.

 బుధవారం ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఐరాస ఈ నివేదికను విడుదల చేసింది. ‘అధునాతన వ్యర్థ జల నిర్వహణ పద్ధతులు ఇచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయడం అర్థం లేని చర్య’అని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా అన్నారు. యునెస్కో సహా పలు ఐరాస విభాగాలు కలసి ఈ నివేదికను రూపొందించాయి.

కొన్ని దశాబ్దాలుగా ప్రజలు నీటిని అధికంగా ఖర్చు చేస్తున్నారనీ, ప్రజలు జలాలను వాడుతున్నంత వేగంగా ప్రకృతి తిరిగి ఉత్పత్తి చేయలేకపోతోందనీ, దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఆకలి, వ్యాధులు, ఘర్షణలు, వలసలు పెరిగిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రాబోయే దశాబ్దంలో ఎదుర్కోబోయే అతి పెద్ద ప్రమాదం నీటి కష్టాలేననే అభిప్రాయం గతేడాది ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సర్వేలోనూ వెల్లడైంది. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల అనేక ప్రాంతాలు ఇప్పటికే కరువు బారిన పడుతున్నాయని నివేదిక తెలిపింది.

 కలుషిత నీరు తాగడం, చేతులు సరిగ్గా కడుక్కోలేక పోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి ఎనిమిది లక్షల మంది మరణిస్తున్నారని నివేదిక వెల్ల డించింది. నీటి సంబంధిత కారణాలతో ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాల్లో కలిసి ఏడాదికి 35 లక్షల మంది మరణిస్తున్నారనీ, ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్, కారు ప్రమాదాల్లో కలిపి మరణించే వారి కన్నా ఈ సంఖ్య అధికమని పేర్కొంది.

2040కి ప్రతి నలుగురు బాలల్లో ఒకరికి..
2040 సంవత్సరం కల్లా ప్రపంచంలోని ప్రతి నలుగురు బాలల్లో ఒకరు తీవ్రమైన నీటి కష్టాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుంటారని ఐరాస అంతర్జాతీయ చిన్నారుల అత్యవసర నిధి (యూనిసెఫ్‌) సంస్థ మరో నివేదికలో చెప్పింది. వాతావరణంలో మార్పులు, కరువు, పెరుగుతున్న జనాభా నీటి కొరతకు ప్రధాన కారణాలంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 36 దేశాలు తీవ్రమైన నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయని వెల్లడించింది.

Advertisement
Advertisement