ఇన్ఫోసిస్‌ పేరుతో యువతికి గాలం.. | Sakshi
Sakshi News home page

ఇన్ఫోసిస్‌ పేరుతో యువతికి గాలం..

Published Tue, Nov 1 2016 8:03 PM

ఇన్ఫోసిస్‌ పేరుతో యువతికి గాలం.. - Sakshi

హైదరాబాద్: మాయ మాటలతో యువతులను వలలో వేసుకోవడం.. మారుపేర్లతో మోసాలకు పాల్పడటం.. పోలీసులు పట్టుకుంటే చాకచక్యంగా ఎస్కేప్ కావడం.. అంతలోనే నకిలీ డాక్టర్ అవతారం.. కాసేపటికే ఎంపీ మనవడిలా వ్యవహారం.. ఇదీ 420లకే 420 అయిన గజ నేరస్తుడు వెంకటరమణ తీరు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల పరిధిలో 45 కేసుల్లో నిందితుడైన ఇతను తాజాగా గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడీ క్యూ3 కారుతో ఉడాయించాడు. అంతకు కొద్దిరోజుల ముందు ఇన్ఫోసిస్ పేరుతో యువతికి గాలం వేశాడు.

ఘరానా మోసగాడైన వెంకట రమణకు ఇంటర్‌నెట్‌లో చాటింగ్‌ చేసే అలవాటు ఉంది. ఆర్కూట్‌లో ఓ ఐడీ సష్టించుకుని కోస్తా జిల్లాలకు చెందిన ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇన్ఫోసిస్‌ సంస్థలో ప్రాజెక్టు లీడర్‌నని, వివాహం చేసుకుంటానని ఆ యువతిని నమ్మించి చోరీ చేసిన ద్విచక్ర వాహనం (యమహా ఆర్‌–15)పై ఆమెను హైదరాబాద్‌ తీసుకువచ్చాడు. డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పేరుతో బోగస్‌ ఐడీ కార్డు సష్టించి, ఉస్మానియా మెడికల్‌ కాలేజీ గెస్ట్‌హౌస్‌లో యువతితో సహా బస చేశాడు. ఆ ఆవరణలోనే ఉన్న సాంట్రో కారునీ చోరీ చేశాడు.

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మనమడినంటూ తాను షిర్డీలో రూ. 2 కోట్లు వెచ్చించి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నానని నమ్మించి ఆ ప్రాంతానికి చెందిన బిల్డర్‌ గోపాల్‌ గౌడ్‌ నుంచి రూ.1.8 లక్షలు స్వాహా చేశాడు. వంశీ కష్ణ చౌదరి పేరుతో నకిలీ డాక్టర్‌ అవతారం ఎత్తి కర్నూలు మెడికల్‌ కాలేజీ విద్యార్థుల నుంచి రూ.1.72 లక్షలు వసూలు చేశాడు. ఢిల్లీలో కర్నూలు మెడికల్‌ కాలేజీ తరఫున ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నానంటూ ఒక్కో విద్యార్థి నుంచి రూ.1050 చొప్పున 160 మంది దగ్గర వసూలు చేశాడు. వెంకటరమణ నేరచరిత్రను ఇంకా వెనక్కి తిరగేస్తే...

తూర్పుగోదావరి జిల్లా కరప మండలం జి.భావవరం గ్రామానికి చెందిన వెంకటరమణ జల్సాలకు అలవాటుపడి 1999 నుంచి పెడదారులు పట్టాడు. తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు, కృష్ణ, హైదరాబాద్, విశాఖపట్నం జిల్లాల్లో ఇతనిపై 45 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికి నలుగురు యువతులను మోసం చేసి వివాహం చేసుకున్నాడు.

మరో ఇద్దరిని పెళ్లి పేరుతో లోబరుచుకున్నాడు. డాక్టర్‌నని చెప్పుకుంటూ రైళ్లల్లో ప్రయాణించి సాటి ప్రయాణికుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు చోరీ చేస్తుండటంతో రైల్వే పోలీసులకు ఆరుసార్లు పట్టుబడ్డాడు. నకిలీ గుర్తింపు కార్డుతో హైదరాబాద్‌లోని అప్పటి సత్యం కంప్యూటర్స్‌ కార్యాలయాంలోకి ప్రవేశించి అక్కడి ఉద్యోగుల క్రెడిట్‌ కార్డులు చోరీ చేయడమేగాక ఓ మారుతీ కారును ఎత్తుకెళ్లాడు. రమణను తొలిసారిగా 1999లో తూర్పుగోదావరి జిల్లా కరప పోలీసులు అరెస్ట్ చేశారు,

అలా వరుసగా నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కుతున్న రమణ.. 2007లో ఏకంగా ఎస్కార్ట్‌ కళ్ళుగప్పి ఎస్కేప్‌ అయ్యాడు. హైదరాబాద్‌ చేరుకుని ఇన్స్పెక్టర్ కుమారుడినని చెప్పుకుని ఎస్సార్‌నగర్‌ లో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నాడు. అందులో బోగస్‌ సంస్థ ఏర్పాటుచేసి కొందరు ఉద్యోగులనూ చేర్చుకున్నాడు. వారి పేర్లతో బ్యాంకు రుణాలు తీసుకుని పరారయ్యాడు. కాకినాడలో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలిస్తుండగా, 2008 అక్టోబర్‌ 14న ఎస్కార్ట్‌కు మస్కా కొట్టి కాకినాడలో తప్పించుకున్నాడు. 2009 ఫిబ్రవరి 14న పాతబస్తీలో ఇతన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చంద్రాయణగుట్టలో అరెస్టు చేశారు. ఓ కేసు విచారణ కోసం విశాఖపట్నం పోలీసులు అక్కడకు తరలించారు. ఆ ఏడాది ఏప్రిల్‌ 23న విశాఖపట్నంలోని సీఎంఎం కోర్టు నుంచి మరోసారి ఎస్కేప్‌ అయ్యాడు.

విశాఖపట్నంలో పరారైన వెంకట రమణ నెల్లూరు చేరాడు. అక్కడి నారాయణ డెంటల్‌ కాలేజీలోని పవన్ కుమార్‌ అనే విద్యార్థిని బురిడీ కొట్టించి రూ.1.5 లక్షల విలువైన బైక్‌తో ఉడాయించాడు. తాను ఆప్తమాలజీలో పీజీ చేస్తున్నానని, మీ కాలేజీలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా వస్తున్నానంటూ అతని గదిలో స్థానం సంపాదించాడు. ఆపై అదను చూసుకుని అతని యమహా ఆర్‌–15 బైక్‌ చోరీ చేసి, దీనిపైనే హైదరాబాద్‌ చేరుకున్నాడు. మాదాపూర్‌లోని కాసాని జీఆర్‌ హోటల్‌లో ఎంపీ రాయపాటి సాంబశివరావు బంధువునంటూ బస చేశాడు. 15 రోజుల పాటు ఉండి అద్దె చెల్లించడకుండా పరారయ్యాడు. అదే ఏడాది జూలై 4న అపోలో ఆసుపత్రిలో డాక్టర్‌నని చెప్పుకుంటూ బంజారాహిల్స్‌లోని సోనీ వయో షాప్‌లో ల్యాప్‌టాప్‌ తస్కరించాడు.

Advertisement
Advertisement