ఆరు శాఖలకు అధిపతి..!! | Sakshi
Sakshi News home page

ఆరు శాఖలకు అధిపతి..!!

Published Sun, Aug 9 2015 1:58 AM

ఆరు శాఖలకు అధిపతి..!!

ఆరు శాఖల మంత్రికి ఎనిమిది లక్షలంట.... ఇపుడు ఏపీ సచివాలయంలో ఇదే హాట్ టాపిక్. ఆరు శాఖల మంత్రికి ఎనిమిది  లక్షలు ఏమిటి అని అనుకుంటున్నారా?... ఏపీ మంత్రివర్గంలో ఒకరికి ఆరు శాఖలు కేటాయించారు. ఆయన పేషీ  సిబ్బంది కూడా ఇదే విషయాన్ని గర్వంగా చెప్తుంటారు. ఈ ఆరు శాఖల మంత్రి పూర్వపు మిత్రుడు ఒకరు ఏడాది క్రితం ఒక ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న తన కుమార్తెను బదిలీ చేయించాల్సిందిగా కోరారు. అందుకు అంగీకరించిన సదరు మంత్రిగారు చాలా కష్టమైన ఈ పనికి చాలా ఖర్చవుతుందని సెలవిచ్చారు. అందుకు సరేనన్న మంత్రిగారి పూర్వపు సహోద్యోగి ఎంత ఖర్చవుతుందో చెప్పమన్నారు. అందుకు ఆ మంత్రిగారు ఆ లెక్క, ఈ లెక్క వేసి పది లక్షలు ఖర్చవుతుందని చె ప్పారు. బాబ్బాబు గతంలో మనిద్దరం సహోద్యోగులం అంత అయితే ఇచ్చుకోలేను, ఓ రెండు తగ్గించుకో అని బతిమిలాడి తన కుమార్తె  బదిలీ కోసమని ఎనిమిది లక్షలు అప్పగించారు.

ఇలా ఎనిమిది లకారాలు మంత్రి గారికి ఇచ్చి సదరు మాజీ సహోద్యోగి ఎనిమిది నెలల పాటు కాళ్ల చెప్పులరిగేలా ఆయన చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. ఎపుడు అడిగినా బ్రదర్ ఈ రోజు అయిపోతుంది, రేపు అయిపోతుందని మాటలతో సరిపెట్టారు. చివరకు మంత్రివల్ల  పనికాదని నిర్ధారించుకున్న ఆ మాజీ సహోద్యోగి తన కుమార్తె పనిచేసే శాఖ ఉన్నతాధికారి దగ్గరకు వెళ్లి తన బాధను వెళ్లబోసుకున్నారు. దీంతో కనికరించిన ఆ మహిళా ఉన్నతాధికారి పైసా ఖర్చు లేకుండా బదిలీ చేసి పెట్టారు. ఇదే విషయాన్ని ఆ మంత్రిగారి మాజీ సహోద్యోగి అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు చెప్తుండటంతో ఇదే అంశం ఇపుడు సచివాలయంలో హాట్ టాపిక్‌గా మారింది.
 
 

Advertisement
Advertisement