Sakshi News home page

నిర్ణయం ఎవరిదైనా.. అమలు పోలీసులదే

Published Thu, Jul 30 2015 8:51 PM

నిర్ణయం ఎవరిదైనా.. అమలు పోలీసులదే - Sakshi

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శనివారం (ఆగస్టు 1) నుంచి హెల్మెట్ తప్పనిసరి నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం స్పష్టం చేయడంతో పోలీసు విభాగం ఉలిక్కిపడింది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హెల్మెట్ల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడే అమలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తోంది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న వారి సంఖ్యను చూస్తే.. ద్విచక్ర వాహనాలే ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నిరోధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో హెల్మెట్ వినియోగం తప్పనిసరి చేస్తూ పోలీసు విభాగం దాదాపు మూడు నెలల క్రితమే నిర్ణయం తీసుకుంది.

జూలై 1 నుంచి ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని డీజీపీ మే నెలలోనే ప్రకటించారు. ఆర్టీఏ రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న టూ వీలర్స్ సంఖ్య 61,47,523గా నమోదైంది. వీటిలో అత్యధికం జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లోనే ఉంటాయని పోలీసు విభాగం అంచనా వేసింది. అప్పటికి హెల్మెట్ వినియోగం కేవలం 10 శాతం మాత్రమే ఉండటం, మిగిలిన వారందరికీ అవసరమైన స్థాయిలో జూన్ 30లోపు హెల్మెట్లు అందించగలిగే స్థాయిలో వాటి షోరూమ్స్ లేకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న పోలీసు విభాగం హెల్మెట్ నిబంధన అమలును ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే జూలై నెల మొత్తం గోదావరి పుష్కరాల బందోబస్తు, భద్రతా ఏర్పాటే సరిపోవడంతో ఇవి అమలులో పెట్టడం సాధ్యం కాలేదు. ‘హెల్మెట్’పై నిర్ణయం ఎవరు తీసుకున్నా అమలు చేయాల్సింది మాత్రం పోలీసు విభాగమే. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల ప్రభావం ప్రజల నుంచి నేరుగా వీరే ఎదుర్కోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు హెల్మెట్ నిబంధనను అమలు చేస్తూనే నిర్ణీత కాలం వాహనచోదకులకు కౌన్సిలింగ్ ఇచ్చి, ఆ తరవాత మాత్రమే జరిమానా విధింపు ప్రక్రియను ప్రారంభించాలని యోచిస్తోంది.

Advertisement
Advertisement