సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హైటెక్ నిఘా | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హైటెక్ నిఘా

Published Sat, Oct 3 2015 11:02 PM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో హైటెక్ నిఘా

- 58 అధునాతన సీసీ కెమెరాల ఏర్పాటు
- ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్
- నేరాల అడ్డుకట్టకు పోలీసుల వ్యూహం

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలు నిఘా నీడలోకి వచ్చాయి. ఈ ప్రాంతంలో పోలీసులు 58 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఫలితంగా తరచూ రైల్వేస్టేషన్ ప్రాంతంలో చోటుచేసుకునే దొంగతనాలు, దోపిడీలకు అడ్డుకట్టపడనుంది. శనివారం సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ కార్యదర్శి (ఫైనాన్స్) కె.రామకృష్ణారావు. నార్త్‌జోన్ డీసీపీ ఎన్.ప్రకాష్‌రెడ్డి సీసీ కెమెరాలను, కంట్రోలింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఇకపై 24 గంటలు కంట్రోల్‌రూం నుంచే ఎప్పటికప్పుడు రహదారులపై పరిస్థితిని సమీక్షించి, అనుమానితుల కదలికలపై కన్నేసి పోలీసుల్ని అప్రమత్తం చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.

యాబైకి పైగా సీసీ కళ్లు..
సికింద్రాబాద్ స్టేషన్ ముందుగల రహదారితో పాటు జనసమ్మర్థం ఉండే రహదారుల్లో రాత్రి వేళల్లో సైతం పనిచేయగలిగే 58 అధునాతన సీసీ కెమెరాలు అమర్చారు. రైల్వేస్టేషన్ ఎదుట రహదారికి ఇరువైపులా ఆల్ఫాహోటల్ నుంచి రేతిఫైల్ బస్‌స్టేషన్ వరకు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగతావి చిలకలగూడ చౌరస్తా నుంచి సంగీత్ చౌరస్తా వరకు, సంగీత్ చౌరస్తా నుంచి క్లాక్‌టవర్ వరకు, క్లాక్ టవర్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు వలయాకారంలో కెమెరాలు ఏర్పాటయ్యాయి. సికింద్రాబాద్ ప్రాంతంలోని 57 మంది వ్యాపారులు, వాణిజ్యరంగ ప్రముఖుల, ఎన్‌టీపీసీ అధికారుల సౌజన్యంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగలిగారు.

ప్రత్యేక కంట్రోల్ రూం...
సీసీ కెమెరాల ఫుటేజీలను అనుసంధానం చేసేందుకు రైల్వేస్టేషన్ వద్ద ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటైంది. కొత్తగా ఏర్పాటు చేసిన 58 సీసీ కెమెరాల పుటేజీలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా సమీక్షించేందుకు ఇందులో భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, ప్రమాదాలు, వాహనాలరాకపోకల తీరును ప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేకంగా సాంకేతిక నిపుణులను నియమించారు. కంట్రోల్‌రూమ్ ఇరవైనాలుగు గంటలు పనిచేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

నేరం జరుగుతుదని ముందే గుర్తించినా, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్టు కంట్రోల్‌రూం సిబ్బంది గుర్తించినా వెంటనే పోలీస్‌స్టేషన్‌కు లేదా ఆయా ప్రాంతంలో విధుల్లో ఉన్న బీట్ కానిస్టేబుళ్లకు ఫోన్‌ద్వారా సమాచారం అందించడం కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహించే సిబ్బంది డ్యూటీ. సంగీత్ చౌరస్తా, క్లాక్‌టవర్, చిలకలగూడ చౌరస్తా, అల్ఫాహోటల్, రేతీఫైల్ బస్‌స్టేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక పికెటింగ్‌లు ఏర్పాటు చేసి పోలీసులను అందుబాటులో ఉంచుతారు. నేరాన్ని, నేరగాళ్ల సంచారాన్ని బట్టి ఆయా పికెటింగ్‌ల వద్ద ఉండే పోలీస్ సిబ్బందికి సమాచారం అందించడం ద్వారా నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చునన్నది పోలీసుల ఆలోచన.

Advertisement

తప్పక చదవండి

Advertisement