కేసుకు సెలవు! | Sakshi
Sakshi News home page

కేసుకు సెలవు!

Published Sun, Jul 26 2015 2:43 AM

కేసుకు సెలవు! - Sakshi

♦ పక్కదారి పట్టించేందుకు వ్యూహం   
♦ మరిన్ని అకృత్యాలు వెలుగులోకి వస్తాయనే భయం
♦ మిగిలిన విద్యార్థులు, ప్రిన్సిపల్‌ను కాపాడే యత్నం
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి పది రోజులు సెలవు ప్రకటించడం పట్ల వివిధ వర్గాల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రిషితేశ్వరి మృతి కేసులో మిగిలిన దోషులు, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును కాపాడేందుకు రిజిస్ట్రార్ వ్యూహాత్మకంగా సెలవులు ప్రకటించారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిషితేశ్వరి ర్యాగింగ్‌లో పదిమందికిపైగానే విద్యార్థులు ఉన్నారని, ఇప్పటికి ముగ్గురు అరెస్టు కాగా, మిగిలిన వారిని ఈ కేసు నుంచి రక్షించేందుకు సెలవులు ప్రకటించారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి.

యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే అధికారం లేకపోయినప్పటికీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచనల మేరకు వైస్ ఛాన్సలర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇదంతా కేసును నీరుగార్చేందుకేనని ప్రజా సంఘాలు చెబుతున్నాయి. గతంలో ఇంత కంటే పెద్ద సంఘటనలు జరిగినప్పటికీ యూనివర్సిటీకీ సెలవులు ప్రకటించలేదు. రిషితేశ్వరి మృతి కేసులోని దోషులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఓ వైపున పోలీస్ దర్యాప్తు, మరోవైపు విశ్వవిద్యాలయం నియమించిన కమిటీ, ఇంకోవైపు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు కృషి చేస్తున్నాయి.

 లైంగిక వేధింపులు బహిర్గతం అయ్యేవి..
 విద్యార్థి సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని ఉదృ్ధతం చేస్తూ వాస్తవాలు వెలుగులోకి వచ్చే వాతావరణాన్ని తీసుకువచ్చాయి. ఈ క్రమంలోనే ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు చేష్టలు, వ్యవహారశైలి బహిర్గతం అయ్యాయి. ప్రిన్సిపల్ వ్యవహారాన్ని విద్యార్థులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆ ప్రిన్సిపల్‌తోపాటు మరికొందరు ప్రొఫెసర్ల అకృత్యాలు, లైంగిక వేధింపుల వివరాలు విద్యార్థుల వద్ద ఉన్నట్టు నిఘా సంస్థలు ప్రభుత్వానికి సమాచారం అందించాయి.

గతంలో సైన్స్ కళాశాలలోని ఒక విభాగంలో పరిశోధనా పర్యవేక్షకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా పరిశోధకురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. పొరుగు సేవల ఉద్యోగిని సంబంధిత విభాగ అధికారి తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసింది. ఇవన్నీ కొంతకాలానికి సద్దుమణిగిపోయాయి. విచారణ నిర్విరామంగా కొనసాగితే వీటిని విద్యార్థి  సంఘాలు, ప్రజా సంఘాలు బహిర్గతం చేసే అవకాశాలు ఉండటంతో ఆకస్మికంగా సెలవులు ప్రకటించారనే అభిప్రాయం బలంగా విన్పిస్తోంది.

 బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
 నెల రోజుల క్రితం తరగతులు ప్రారంభమైనప్పటికీ, జూనియర్లకు సక్రమంగా క్లాసులు జరగడం లేదు. సీనియర్లకు గెస్ట్ ఫ్యాకల్టీ వివాదం నేపథ్యంలో పూర్తి స్థాయిలో తరగతులు జరగడం లేదు. వీరికి రెగ్యులర్, ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లాస్‌లు తీసుకుంటున్నారు. మొత్తం మీద ఈ నెల రోజుల్లో పూర్తిస్థాయిలో తరగతులు జరగలేదు. ఈ నేపథ్యంలోనే పది రోజులు సెలవులు ప్రకటించారు. అక్టోబరులో మరో పది రోజులు దసరా సెలవులు ఉన్నాయి. దీంతో విద్యాసంవత్సరం సక్రమంగా జరుగతుందా? సిలబస్ సకాలంలో పూర్తవుతుందాఅనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వైఎస్సార్‌సీపీ నేతలు కూడా శనివారం సాయంత్రం వైస్‌ఛాన్సలర్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి ప్రకటించిన సెలవులను రద్దు చేయాలని, యూనివర్సిటీలో విద్యార్థినిలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఘటనలో బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, ఎస్‌సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement