భర్త మరణించాక.. భార్యకు కానుకలు చేరాయి | Sakshi
Sakshi News home page

భర్త మరణించాక.. భార్యకు కానుకలు చేరాయి

Published Fri, Feb 17 2017 8:33 AM

మేజర్ సతీష్‌ భార్య సుజాత (మధ్యలో). ఇన్‌సెట్‌లో సతీష్‌ - Sakshi

బనివాడ: హరియాణాలోని బనివాడి గ్రామానికి చెందిన 31 ఏళ్ల సతీష్‌ దహియా సైన్యంలో మేజర్. శుక్రవారం ఆయన మూడో వివాహ వార్షికోత్సవం. భార్య సుజాతకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేకు, కొవ్వొత్తులు, పూలు పంపారు. సతీష్‌ అనుకున్నట్టు జరిగివుంటే ఈ రోజు వేడుకలు చేసుకునేవారు. పెళ్లిరోజు నాటికి ఆయన ఈ లోకంలో లేరు. సతీష్ పంపిన కానుకలు భార్యకు చేరకుముందే.. జమ్ము కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఆయన వీరమరణం పొందారు. ఆయన మరణించిన కొన్ని గంటల తర్వాత భార్యకు కానుకలు అందాయి. పెళ్లిరోజు వేడుకతో సంతోషంగా గడపాల్సిన సతీష్‌ కుటుంబంలో విషాదం ఏర్పడింది. ఆయన మరణవార్తతో బనివాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

గురువారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం బనివాడకు తీసుకువచ్చారు. రెండేళ్ల కూతురు ప్రియష ఆయనకు అంత్యక్రియలు నిర్వహించింది. సతీష్‌కు నివాళి అర్పించేందుకు చుట్టుపక్కల గ్రామాల వారు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 'ఆయన మరణవార్త విన్న కొన్ని గంటల కానుకలు అందాయి. నాకోసం గ్రీటింగ్ పంపారు. ఐ లవ్ యూ పూచా, నీవే నాకు స్ఫూర్తి అంటూ రాశారు' అంటూ సుజాత్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతటి బాధలోనూ ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా.. దేశం కోసం తన భర్త వీరమరణం పొందడం గర్వంగా ఉందని చెప్పారు. హంద్వారా, బండిపొరలలో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో మరో ముగ్గురు సైనికలు మరణించారు. హంద్వారా జరిగిన ఆపరేషన్‌కు సతీష్ నాయకత్వం వహించారు. ఓ ఇంటిలో తలదాచుకున్న ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు.

Advertisement
Advertisement