చౌకలో షేర్లను కనుక్కొనేదెలా? | Sakshi
Sakshi News home page

చౌకలో షేర్లను కనుక్కొనేదెలా?

Published Sun, Oct 20 2013 1:25 AM

How to make money in shares

ప్రపంచవ్యాప్తంగా షేర్లను ఎంపిక చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు అనేక విధానాలు అందుబాటులో ఉన్నా రెండు విధానాలనే ఎక్కువగా అవలంబిస్తుంటారు. వీటిని గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్, వేల్యూ ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు. ఈ రెండు విధానాల్లో షేర్ల ఎంపిక అనేది పీఈ నిష్పత్తి ఆధారంగానే జరుగుతుంది. కాని ఈ రెండు పూర్తి విభిన్నమైనవి. గ్రోత్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో పీఈ రేషియో ఎక్కువ ఉన్న షేర్లను ఎంచుకుంటే, వేల్యూ ఇన్వెస్ట్‌మెంట్‌లో తక్కువ పీఈ నిష్పత్తి ఉన్న షేర్లను ఎంపిక చేసుకుంటారు.
 
 వేల్యూ ఇన్వెస్ట్‌మెంట్ అంటే..
 ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉండి కూడా మార్కెట్లోని పరిస్థితుల దృష్ట్యా తక్కువ రేటు వద్ద ట్రేడ్ అవుతున్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అంటే వాస్తవ విలువ కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతూ భవిష్యత్తులో పెరగడానికి అవకాశం ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ఈ విధానంలో ముఖ్యంగా ఆయా కంపెనీల ఫండమెంటల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. కొన్ని సందర్భాల్లో వ్యాపార పరంగా వృద్ధికి అవకాశం ఉన్నా వివిధ పుకార్లు, లేదా మార్కెట్ సెంటిమెంట్ వంటి వాటి వల్ల షేర్లు బాగా పతనమవుతాయి. ఇలాంటి సందర్భాల్లో వాటిని గుర్తించి ఇన్వెస్ట్ చేయడాన్నే వేల్యూ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. కంపెనీల సగటు పీఈ నిష్పత్తి కంటే ఎంత తక్కువగా ఉంటే అంత చౌకగా ఈ షేర్లు లభిస్తున్నట్లు. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే.. రూ.100 వస్తువు రూ.70కే లభిస్తుంటే దాన్ని కొనడం అనేది తెలివైన నిర్ణయమేనా... కాదా?
 
 తెలియడం లేదా?...
 కంపెనీ ఫండమెంటల్స్, పీఈ రేషియో అనేవి సాధారణ ఇన్వెస్టర్లు అందరికీ అర్థం కావు. ఇవి తెలుసుకోవాలంటే రోజువారీ స్టాక్ మార్కెట్ కదలికలపై పట్టు ఉండాలి. వీటిపై అవగాహన లేని వారి కోసం ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టాయి. ఇవి తక్కువ పీఈలో ఉన్న షేర్లను కొనుగోలు చేసి అవి అధిక ధరకు చేరిన తర్వాత విక్రయించడం జరుగుతుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌తో పాటు ఇతర మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టాయి.

Advertisement
Advertisement