సారీ.. నేను సాయం చేయలేను: సుష్మా | Sakshi
Sakshi News home page

సారీ.. నేను సాయం చేయలేను: సుష్మా

Published Sat, Dec 31 2016 3:09 PM

సారీ.. నేను సాయం చేయలేను: సుష్మా

న్యూఢిల్లీ: కష్టాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైనా ట్వీట్‌ చేసిన వెంటనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందిస్తారు. వారి కష్టాలను తెలుసుకుని సాయం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. కాగా భారత్‌లో కష్టాల్లో ఉన్న ఓ ఇరానీ మహిళకు సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం విన్నవించగా.. తాను ఆమె విషయంలో సాయం చేయలేననని సుష్మా చెప్పారు. ఇరానీ మహిళ కేసు కోర్టు పరిధిలో ఉందని, అందువల్ల తాను జోక్యం చేసుకోలేనని స్పష్టం చేశారు.

ఇరాన్‌లో జన్మించి బ్రిటీష్‌ పౌరసత్వం కలిగిన నర్గెస్‌ అష్టారికి ఓ కేసులో ఒడిశా కోర్టు 3 లక్షల రూపాయల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది. ఆమె పైకోర్టులో అప్పీలు చేయగా, కేసు పెండింగ్‌లో ఉంది. బెయిల్‌పై ఆమె విడుదలైంది. అష్టారికి సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం సుష్మా దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె కేసు న్యాయస్థానంలో ఉన్నందును తాను సాయం చేయడం సాధ్యంకాదని బదులిచ్చారు. అష్టారి కేసుకు సంబంధించిన వివరాలను ఒడిశా ప్రభుత్వం నుంచి సుష్మా తెలుసుకున్నారు. 2011లో ఒడిశాలో ఓ ఎన్జీవో (ఏఎస్ఎస్‌ఐఎస్‌టీ) తరఫున పనిచేసేందుకు ఆమెకు వీసా మంజూరైంది. ఆ తర్వాత అష్టారి సొంతంగా ఎన్జీవో ప్రిషన్‌ ఫౌండేషన్‌ను స్థాపించింది. ఒడిశాలోని రాయగఢ్‌ జిల్లాలో సొంత డబ్బులతో బాలికల కోసం ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. 2014లో ఓ అంధ బాలుడు ప్రమాదవశాత్తూ ఓ నదిలో పడి గల్లంతయ్యాడు. అతని తల్లిదండ్రులు అదే పాఠశాలలో పనిచేస్తారు. కాగా ఏఎస్ఎస్‌ఐఎస్‌టీ ఒత్తిడి మేరకు వాళ్లు అష్టారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకును ఆమె నదిలో తోసి చంపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement
Advertisement