'ప్రాణాలైనా ఇస్తా, రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను' | Sakshi
Sakshi News home page

'ప్రాణాలైనా ఇస్తా, రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను'

Published Wed, Aug 2 2017 9:04 AM

'ప్రాణాలైనా ఇస్తా, రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వను'

చోప్రా: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర విభజనకు తాను ఎన్నడూ మద్దతునివ్వబోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. ప్రత్యేక గూర్ఖాలాండ్‌ రాష్ట్రం కోసం పోరాడుతున్న డార్జిలింగ్‌ కొండప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ప్రత్యేక రాష్ట్రం కోసం డార్జిలింగ్‌లో కొనసాగుతున్న నిరవధిక బంద్‌ 48వ రోజుకు చేరుకోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఏదిఏమైనా కానివ్వండి.. నా ప్రాణాలైనా ఇస్తాను కానీ, రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు మద్దుతునివ్వను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి జిల్లా మన ఆస్తి. అన్ని మతాలు, అన్ని కులాలకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. భారతదేశం అంటే ఇదే. దీనిని కాపాడుకోవాలి కానీ విడగొట్టకూడదు. బెంగాల్‌లోని ఇతర జిల్లాల మాదిరిగానే కొండప్రాంతాన్ని ప్రేమిస్తాను. డార్జిలింగ్‌ హిల్స్‌ పశ్చిమ బెంగాల్‌లో భాగం. భవిష్యత్తులోనూ అదే కొనసాగుతోంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి' అని దినాజ్‌పూర్‌ జిల్లా చోప్రా ప్రాంతంలో జరిగిన సభలో మమత అన్నారు. డార్జిలింగ్‌ అభివృద్ధి కోసం తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని ఆమె తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement