Sakshi News home page

గృహ రుణాలపై ఐసీఐసీఐ వడ్డీరేట్ల తగ్గింపు

Published Mon, Dec 23 2013 1:30 AM

గృహ రుణాలపై ఐసీఐసీఐ వడ్డీరేట్ల తగ్గింపు

ముంబై: ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బాటలోనే.. తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కూడా గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. కొత్తగా గృహ రుణం తీసుకునేవారికి 15 బేసిస్ పాయింట్ల(0.15 శాతం) తగ్గింపుతో ప్రత్యేక స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం రూ.75 లక్షల వరకూ రుణాలపై 10.25 శాతం, రూ. 75 లక్షలకు పైబడిన రుణాలపై 10.50 శాతం చొప్పున వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుత రుణగ్రహీతలకు మాత్రం ఇప్పుడున్న 10.40%, 10.65% రేట్లు యథావిధంగా కొనసాగుతాయని వెల్లడించింది.

కొత్త ఆఫర్ తక్షణం అమల్లోకి వచ్చిందని... జనవరి 31 వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం ఐసీఐసీఐ కనీస రుణ(బేస్) రేటు 10%గా ఉంది. కొత్త గృహ రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ 0.4% వరకూ.. హెచ్‌డీఎఫ్‌సీ పావు శాతం మేర(జనవరి 31 వరకూ ఆఫర్) వడ్డీరేట్లను తగ్గించడం తెలిసిందే. తాజా సమీక్షలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం విదితమే

Advertisement
Advertisement