వేలానికి డీసీ ట్రేడ్‌మార్క్‌లు | Sakshi
Sakshi News home page

వేలానికి డీసీ ట్రేడ్‌మార్క్‌లు

Published Wed, Aug 14 2013 1:17 AM

వేలానికి డీసీ ట్రేడ్‌మార్క్‌లు - Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తామిచ్చిన రుణాలను వసూలు చేసుకునేందుకు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్‌కు(డీసీహెచ్‌ఎల్) చెందిన ఆస్తులను విక్రయించడంపై బ్యాంకులు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా  డీసీహెచ్‌ఎల్‌కు చెందిన డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్ మార్క్‌లను విక్రయించాలని ఐడీబీఐ బ్యాంక్ నిర్ణయించింది. ఈ ట్రేడ్ మార్క్‌లను దక్కించుకోవడానికి ఆసక్తి ఉన్న సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొనవవచ్చని ఐడీబీఐ బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నాలుగు ట్రేడ్ మార్క్‌లను తనఖా పెట్టుకొని 2011లో  ఐడీబీఐ బ్యాంకు రూ.250 కోట్ల రుణాన్ని డీసీహెచ్‌ఎల్‌కు మంజూరు చేసింది. ఆ మొత్తం వడ్డీతో కలిసి రూ. 297 కోట్లకు చేరింది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో ఈ ట్రేడ్ మార్క్‌లను ఇతరులకు విక్రయించాలని ఐడీబీఐ బ్యాంకు నిర్ణయించింది. అధిక ధర ఆఫర్ చేసే వారికి వీటిని విక్రయించనున్నట్లు బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.
 
 డీఆర్‌టీలో పిటిషన్
 ఇదిలా ఉండగా, డీసీహెచ్‌ఎల్ తీసుకున్న రుణం మొత్తాన్ని వడ్డీతో సహా రాబట్టుకునేందుకు వీలుగా ఆ సంస్థకు చెందిన నాలుగు ట్రేడ్‌మార్క్‌లను వేలం వేసేందుకు అనుమతించాలని కోరుతూ ఐడీబీఐ బ్యాంకు ముంబై శాఖ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ (డీఆర్‌టీ)ను ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం డీఆర్‌టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement