Sakshi News home page

ములాయంకు ఊహించని ఆఫర్‌

Published Sun, Jan 15 2017 7:28 PM

ములాయంకు ఊహించని ఆఫర్‌ - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు ఏర్పడటం, కొడుకు అఖిలేష్ యాదవ్‌  దూరంకావడంతో దాదాపుగా ఒంటరై, పార్టీ గుర్తు సైకిల్‌ కోసం పోరాడుతున్న ములాయం సింగ్‌ యాదవ్‌కు ఊహించని ఆఫర్‌ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అఖిలేష్‌కు సైకిల్‌ గుర్తు కేటాయించినా లేదా దాన్ని ఎవరికీ కేటాయించకుండా స్తంభింపజేసినా.. తమ పార్టీ గుర్తును, జాతీయ అధ్యక్ష పదవిని ఇస్తామని ములాయంకు లోక్ దళ్‌ ఆఫర్ చేసింది. లోక్ దళ్‌ జాతీయ అధ్యక్షుడు సునీల్ సింగ్‌ ఆదివారం ఈ మేరకు ప్రకటించారు.

లోక్ దళ్‌ పార్టీ గుర్తును, జాతీయ అధ్యక్ష పదవిని ములాయంకు ఆఫర్ చేస్తున్నానని, ఆయనతో కలసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధమని సునీల్‌ సింగ్‌ చెప్పారు. ములాయంను కలసి ఈ ప్రతిపాదన చేసినట్టు తెలిపారు. సీబీఐ కేసు నుంచి తన కొడుకు, కుమార్తెను కాపాడుకునేందుకు రాంగోపాల్ యాదవ్‌ ప్రయత్నిస్తున్నారని, ఆయన మాటలను నమ్మవద్దని, తండ్రి ములాయం మాట ప్రకారం నడుచుకోవాల్సిందిగా అఖిలేష్‌కు సూచించారు. అలాగే అఖిలేష్‌తో విభేదాలను పరిష్కరించుకోవాల్సిందిగా ములాయంను కోరారు.

అఖిలేష్‌ వర్గంలో రాంగోపాల్ యాదవ్‌, పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీలు, 200 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉండగా.. ములాయం వెంట సోదరుడు శివపాల్‌ యాదవ్‌, సన్నిహితుడు అమర్ సింగ్‌తో పాటు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇరు వర్గాలు ఈసీని కలసి పార్టీ గుర్తు సైకిల్‌ను కేటాయించాల్సిందిగా కోరాయి. ఈ నేపథ్యంలో సునీల్‌ సింగ్‌ ప్రకటన చేశారు.

నాగలితో పొలం దున్నుతున్న రైతు.. లోక్ దళ్‌ గుర్తు. లోక్ దళ్కు ఈసీ గుర్తింపు ఉంది. 1980కి ముందు సోషలిస్ట్‌ నాయకుడు చరణ్‌ సింగ్‌ ఈ పార్టీని స్థాపించారు. ఇందులో ములాయం కూడా వ్యవస్థాపక సభ్యుడు. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడంతో ఈ పార్టీకి ప్రజల్లో గుర్తింపు లేకుండా పోయింది. 2012లో ఈ పార్టీ 76 స్థానాల్లో పోటీ చేయగా, అన్ని చోట్లా ఓడిపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement