హైదరాబాద్‌లో సంచలనం: ప్రఖ్యాత ఆస్పత్రి మూసివేత | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో సంచలనం: ప్రఖ్యాత ఆస్పత్రి మూసివేత

Published Sat, Jun 17 2017 8:20 PM

హైదరాబాద్‌లో సంచలనం: ప్రఖ్యాత ఆస్పత్రి మూసివేత - Sakshi

- అక్రమ ‘సెరోగసీ’లపై సర్కారు ఉక్కుపాదం
- సాయికిరణ్‌ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌ సీజ్‌.. రికార్డుల స్వాధీనం
- ఉలిక్కిపడ్డ వైద్యరంగం.. త్వరలోనే మరిన్ని దాడులు?


హైదరాబాద్‌
: అడ్డగోలుగా సెరోగసీ(అద్దెగర్భం) ఆపరేషన్లు నిర్వహిస్తోన్న ప్రముఖ ఆస్పత్రిపై ప్రభుత్వాధికారులు దాడిచేసి, సీజ్‌ చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ‘సాయి కిరణ్‌ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌’పై శనివారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 14లోని ‘సాయికిరణ్‌ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌’లో అక్రమ సెరోగసీలు జరుపుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడిచేశారు. అక్కడ అద్దె గర్భాన్ని మోస్తోన్న 48 మంది మహిళలను పోలీసులు గుర్తించారు. వారిలో 16 మంది తెలుగు మహిళలే కావడం గమనార్హం. ఆయా గర్భాలకు సంబధించిన రికార్డుల్లో అవకతవకలున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తుండటంతో ఆస్పత్రిని సీజ్‌ చేశారు.

వచ్చేది రూ.40 లక్షలు.. ఇచ్చేది రూ.3లక్షలు
‘సాయికిరణ్‌ ఇన్ఫెర్టిలిటీ సెంటర్‌’ గతంలోనూ 70కిపైగా సెరోగసీ ఆపరేషన్లు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్‌-హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ సంయుక్త దాడిలో వెల్లడైంది. నేపాల్‌, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన కస్టమర్లు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి బిడ్డలను పొందినట్లు తెలిసింది. సాయికిరణ్‌ ఆస్పత్రి నిర్వాహకులు.. ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.40 లక్షల వరకూ వసూలు చేశారని సమాచారం. అదే సమయంలో అద్దె గర్భాన్ని మోసే మహిళలకు మాత్రం అతిస్వల్పంగా రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చేవారని తెలిసింది.

భారతదేశంలో బహుగా విస్తరిస్తోన్న సెరోగసీలపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కొద్ది నెలల కిందటే స్పష్టమైన ఆదేశాలు వెలువరించింది. వాటి ప్రకారం రక్త సంబధీకులు, సమీప బంధువులు మాత్రమే అద్దెగర్భాన్ని మోసేందుకు అర్హులవుతారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement