తల్లి శవంతో 9నెలలపాటు ఇంట్లోనే.. | Sakshi
Sakshi News home page

తల్లి శవంతో 9నెలలపాటు ఇంట్లోనే..

Published Mon, Sep 12 2016 11:48 AM

In West Bengal, sons keep mother's body in house for 9 months

హరింఘట: తల్లి మృతదేహాన్ని  కొడుకులు తొమ్మిది నెలల పాటు ఇంట్లోనే ఉంచుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని సింహట్ అనే ప్రాంతంలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్ సాహా(65), అజిత్ సాహా(55)లు అన్నదమ్ములు. వీరి తల్లి నాని బాల సాహా(85) ఈ ఏడాది జనవరి 16న అనారోగ్యంతో కన్నుమూసింది.

శీతాకాలం కావడంతో అన్నదమ్ముల ఇద్దరి ఆరోగ్యం సహకరించక ఆమె శవానికి అంత్యక్రియలు జరిపించకుండా తమతో పాటే ఇంట్లో ఉంచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అంత్యక్రియలు జరిపిద్దామని అన్నదమ్ములిద్దరూ భావించినట్లు చెప్పారు. కానీ అప్పటికి తల్లి శరీరం బాగా పాడైపోవడంతో స్మశానానికి తీసుకెళ్లలేదని వివరించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నదమ్ములిద్దరూ ఎవరితోనూ మాట్లాడరని చెప్పారు. వాళ్ల తల్లి గురించి అడిగితే ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, నిద్రపోతోందని చెప్పేవారని తెలిపారు. ఇంట్లోకి ఎవరిని వెళ్లనిచ్చేవారు కాదని చెప్పారు. కొద్దిరోజుల క్రితం హరింఘట మునిసిపాలిటీలో పని చేసే ఉద్యోగి రూపక్  వీళ్ల ఇంటి కొలతలు తీసుకునేందుకు అక్కడికి వెళ్లాడు. అయితే అతడిని సోదరులిద్దరూ ఇంట్లోకి అనుమతించకపోవడంతో వెనుదిరిగినట్లు వెల్లడించారు.

అన్నదమ్ముల అనుమానాస్పద ప్రవర్తనతో రూపక్, స్థానికులతో కలిసి ఇంట్లోకి వెళ్లడానికి పథకం వేశాడు. ఆరుగురు స్థానికులతో కలిసి  బలవంతగా ఇంట్లోకి చొరబడ్డారు. ఈ సందర్భంగా  బెడ్ రూంలో మంచంపై ఉన్న పుర్రెను గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నదమ్ములను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారు ఇరువురికి మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement