‘100 బిలియన్ల’ హామీపై స్పష్టత! | Sakshi
Sakshi News home page

‘100 బిలియన్ల’ హామీపై స్పష్టత!

Published Thu, Dec 3 2015 1:19 AM

‘100 బిలియన్ల’ హామీపై స్పష్టత!

భారత్ సహా ‘బేసిక్’ దేశాల డిమాండ్
 
 లీ బౌజెట్(ఫ్రాన్స్): వాతావరణ మార్పుపై పోరాటానికి మద్దతుగా వర్ధమాన దేశాలకు 2020 నుంచి ఏటా 100 బిలియన్ డాలర్ల సాయం అందిస్తామన్న హామీకి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక కావాలని ధనిక దేశాలను ‘బేసిక్’ దేశాలు డిమాండ్ చేశాయి. వాతావరణ సదస్సులో న్యాయమైన, సమతౌల్య ఒప్పందం కుదిరేందుకు సభ్యదేశాల భాగస్వామ్యం ఉన్న పారదర్శక చర్చల ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తామని బేసిక్ దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, భారత్, చైనాల తరఫున బుధవారం చైనా ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలు ప్రగతిశీల లక్ష్యాలను పెట్టుకోవాలని భారత్ కోరుతోందని పారిస్ చర్చల్లో భారత్ తరఫున పాల్గొంటున్న అజయ్ మాథుర్ తెలిపారు. కర్బన ఉద్గారాల తగ్గింపునకు సంబంధించి ఒబామా ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను తోసిపుచ్చుతూ అమెరికా ప్రతినిధుల సభ రెండు తీర్మానాలను ఆమోదించింది. ఇది ఒబామాకు పెద్ద ఎదురుదెబ్బే.

 మొదటి 10% వాటా 50%: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లోని తొలి 10% మంది వల్ల విడుదలయ్యే శిలాజ ఇంధన ఉద్గారాలు మొత్తం ఉద్గారాల్లో 50% ఉంటాయని, అత్యంత పేదల్లోని చివరి 50% మంది వల్ల విడుదలయ్యే ఉద్గారాలు మొత్తం ఉద్గారాల్లో 10 శాతమేనని ఆక్స్‌ఫామ్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అత్యంత పేద వ్యక్తి వల్ల విడుదలయ్యే కాలుష్య కారకాల కన్నా అత్యంత ధనికుల్లోని మొదటి 1%లో ఉన్న సంపన్నుడి వల్ల విడుదలయ్యే కాలుష్యం 175 రెట్లు అధికంగా ఉంటుందని వెల్లడించింది.

Advertisement
Advertisement