పెరిగిన తెలుగు పత్రికల సర్క్యులేషన్‌ | Sakshi
Sakshi News home page

పెరిగిన తెలుగు పత్రికల సర్క్యులేషన్‌

Published Fri, Dec 23 2016 3:18 AM

పెరిగిన తెలుగు పత్రికల సర్క్యులేషన్‌

వివరాలు వెల్లడించిన ఆర్‌ఎన్‌ఐ ప్రెస్‌ ఇన్‌ ఇండియా 2015–16 పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు పత్రికలు, మ్యాగజీన్ల సర్క్యులేషన్‌ స్వల్పంగా పెరిగింది. గురువారం ఇక్కడ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ న్యూస్‌పేపర్స్‌ ఫర్‌ ఇండియా (ఆర్‌ఎన్‌ఐ) రూపొం దించిన ప్రెస్‌ ఇన్‌ ఇండియా 2015–16 పుస్తకాన్ని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ప్రచురణలో ఉన్న పత్రికలు, మ్యాగజీన్ల వివరాలు, వాటి సర్క్యులేషన్‌ వివరాలను క్రోడీకరించి ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకంలోని వివరాల ప్రకారం 2015–16 ఆర్థిక సంవత్సరంలో తెలుగులో 856 దినపత్రికలు, 125 వారపత్రికలు, 130 పక్షపత్రికలు, 475 మాసపత్రికలు, 7 త్రైమాసిక పత్రికలు, ఒక వార్షిక పత్రిక, 5 పీరియాడికల్స్‌ ప్రచురితమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 1,212, తెలంగాణ నుంచి 369, ఢిల్లీ, తమిళనాడులో 4 చొప్పున, కర్ణాటకలో 3 తెలుగు పత్రికలు ప్రచురితమయ్యాయి. తెలుగు పత్రికల సర్క్యులేషన్‌ 2014–15లో 2,72,01,064 ఉండగా.. 2015–16లో 2,76,45,134కు పెరిగింది. ఇందులో దినపత్రికలు, వార, పక్షపత్రికల సర్క్యులేషన్‌ 1,97,59,795గా ఉంది. మొత్తం 1,596 ప్రచురణ పత్రికల్లో 32 పెద్దవి, 364 మధ్యస్థ, 1,200 చిన్న విభాగం ప్రచురణలని ఆర్‌ఎన్‌ఐ తెలిపింది. 13 దినపత్రికలు, 3 పీరియాడికల్స్‌ లక్ష కాపీలకంటే ఎక్కువ సర్క్యులేషన్‌ కలిగి ఉన్నట్టు ప్రకటించుకున్నాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇలా..
ఏపీ నుంచి వివిధ భాషల్లో 2,52,72,232 కాపీల సర్క్యులేషన్‌ ఉండగా.. ఇందులో తెలుగులో అత్యధికంగా 1,98,29,095 కాపీ లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో దినపత్రికల విభాగంలో 235 ఆంగ్ల పత్రికలు, 26 హిందీ పత్రికలు, ఒక కన్నడ పత్రిక, ఒక ఒడియా పత్రిక, రెండు తమిళ పత్రికలు, 1,241 తెలుగు పత్రికలు, 182 ఉర్దూ పత్రికలు, 15 ద్విభాషా, 7 బహుళ భాషా పత్రికలు వెలువడుతున్నాయి. తెలుగు దినపత్రికల సర్క్యులేషన్‌ 1,42,37,512గా ఉండగా ఆంగ్ల దినపత్రికల సర్క్యులేషన్‌ 32,42,118గా ఉంది. ఉర్దూ దినపత్రికల సర్క్యులేషన్‌ 7,02,711గా ఉంది.

తెలంగాణ నుంచి ఇలా..
తెలంగాణ నుంచి వివిధ భాషల్లో 288 ప్రచురణలు వెలువడుతుండగా ఇందులో 105 దినపత్రికలు, 41 వారపత్రికలు, 24 పక్ష పత్రికలు, 111 మాసపత్రికలు, 3 త్రైమాసిక పత్రికలు ఉన్నాయి. వీటన్నింటి సర్క్యులేషన్‌ 1,15,24,357గా ఉంది. తెలుగు ప్రచురణల సర్క్యులేషన్‌ 76,42,177గా ఉండగా ఉర్దూ ప్రచురణల సర్క్యులేషన్‌ 16,14,125 కాపీలుగా ఉంది. ఆంగ్ల ప్రచురణల సర్క్యులేషన్‌ 15,88,561గా ఉంది. తెలుగు దినపత్రికల సర్క్యులేషన్‌ 53,63,545, ఆంగ్ల దినపత్రికల సర్క్యులేషన్‌ 11,30,537గా, ఉర్దూ దినపత్రికల సర్క్యులేషన్‌ 9,73,610 గా ఉంది. హిందీ దినపత్రికల సర్క్యులేషన్‌ 5,61,944గా ఉంది. 

Advertisement
Advertisement