ఐఎస్ఐఎస్ వెబ్సైట్లపై వేటు! | Sakshi
Sakshi News home page

ఐఎస్ఐఎస్ వెబ్సైట్లపై వేటు!

Published Wed, Oct 14 2015 8:46 PM

ఐఎస్ఐఎస్ వెబ్సైట్లపై వేటు!

న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)కు చెందిన రెండు వెబ్సైట్లను భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ సెర్ట్-ఇన్ బ్లాక్ చేసింది. వాటితోపాటు జమ్ముకశ్మీర్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల పేరుమీద నడుస్తున్న రెండు ఫేస్బుక్ పేజీలను కూడా నిషేధించింది.

ఐఎస్ఐఎస్ స్వయంగా నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లలో తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తుండటంతోపాటు, బాంబులు ఎలా తయారుచేయాలి, మాడ్యూల్స్ ట్రెయినింగ్ వంటి నిషిద్ధ సమాచారాన్ని అందిస్తుండటంతో ఇంటెలిజెన్స్ బ్యూరో, పోలీసుల అభ్యర్థన మేరకు సెర్ట్-ఇన్ ఈ చర్య తీసుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంమంత్రిత్వశాఖ, దర్యాప్తు సంస్థల అధికారులతో కూడిన కమిటీ బుధవారం సెర్ట్-ఇన్ అధికారులతో భేటీ అయి.. ఈ వెబ్సైట్లతో పొంచి ఉన్న ముప్పు గురించి దాదాపు గంటపాటు చర్చించారు. ఆ తర్వాత వెబ్సైట్లను నిషేధించాలని నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన 55-60 వెబ్సైట్లు, సోషల్ నెట్వర్కింగ్ పేజీలను కేంద్రం ఈ ఏడాది బ్లాక్ చేసింది.
 

Advertisement
Advertisement