అంతరిక్షంపై మన విజయానికి స్వర్ణోత్సవం | Sakshi
Sakshi News home page

అంతరిక్షంపై మన విజయానికి స్వర్ణోత్సవం

Published Thu, Nov 21 2013 2:18 PM

అంతరిక్షంపై మన విజయానికి స్వర్ణోత్సవం

మన దేశం ఒక విశిష్టమైన గుర్తింపు సాధించింది. మొట్టమొదటి రాకెట్ ప్రయోగం చేసి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1963 నవంబర్ 21వ తేదీన అమెరికాలో తయారైన రాకెట్ను తొలిసారిగా కేరళలోని తిరువనంతపురం సమీపంలోగల తుంబ అనే చిన్న తీరప్రాంత గ్రామం నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఇప్పుడు ఏకంగా అంగారకుడిని జయించే దిశగా భారత అంతరిక్ష కార్యక్రమం దూసుకెళ్తోంది. ఎక్కువగా తాడిచెట్లతో ఉండే ఈ గ్రామం ఆధునిక భారతదేశ సంస్కృతికి కొంత దూరంగానే ఉంటుంది. కానీ, మొదటి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన చరిత్రను మాత్రం సుస్థిరం చేసుకుంది.

తర్వాతికాలంలో ఈ ప్రయోగ కేంద్రాన్ని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్) అని, ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ (వీఎస్ఎస్సీ) అని పిలవసాగారు. ఇదే అప్పటినుంచి ఇస్రోకు చాలా ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సారాభాయ్ కొంతమంది యువ శాస్త్రవేత్తలను చేరదీసి, వారిని అమెరికా పంపి, అక్కడ సౌండింగ్ రాకెట్ల ప్రయోగంలో శిక్షణ ఇప్పించారు. అలా తొలుత శిక్షణ పొందినవారిలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తదితరులు కూడా ఉన్నారు.

దక్షిణ కేరళలోని తుంబ ప్రాంతం గుండా భూమధ్యరేఖ వెళ్తుండటం వల్ల ఈ ప్రాంతం రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అంతరిక్ష కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాతే శ్రీహరికోటను కూడా అనువైన ప్రాంతంగా గుర్తించి, దాన్ని అభివృద్ధి చేశారు.

Advertisement
Advertisement