పాకిస్థాన్ 'బ్లాక్‌డే'పై భగ్గుమన్న భారత్! | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్ 'బ్లాక్‌డే'పై భగ్గుమన్న భారత్!

Published Fri, Jul 15 2016 7:21 PM

పాకిస్థాన్ 'బ్లాక్‌డే'పై భగ్గుమన్న భారత్! - Sakshi

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌ మరోసారి హద్దుమీరి ప్రవర్తించింది. కశ్మీర్‌ వాసులకు మద్దతుగా జూలై 19న బ్లాక్ డే పాటించనున్నట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ ప్రకటించడంపై భారత్ భగ్గుమంది. ఈ విషయంలో పాకిస్థాన్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము నిర్ద్వంద్వంగా, నిక్కచ్చిగా తిరస్కరిస్తున్నట్టు భారత్ తేల్చిచెప్పింది.

'మా అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చేందుకు పాకిస్థాన్ నిరంతరం చేస్తున్న ప్రయత్నాలు మాకు దిగ్భ్రాంతి  కలుగజేస్తున్నాయి' అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని ఉగ్రవాద సంస్థలకు చెందిన ఉగ్రవాదులను కీర్తిస్తూ పాకిస్థాన్ తన పక్షపాత, కపట బుద్ధిని చాటుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు శుక్రవారం ఉదయం పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఎం ఆసిఫ్ ట్విట్టర్‌లో జమ్ముకశ్మీర్‌లో తాజా ఘటనలను, 2002నాటి గుజరాత్ అల్లర్లతో పోలుస్తూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో మోదీ చేపట్టిన జాతుల నిర్మూలన కశ్మీర్‌లోనూ కొనసాగుతున్నదంటూ ఖవాజా నోరుపారేసుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన భారత్‌ పొరుగుదేశాల విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటూ పాక్‌కు హితవు పలికింది.

హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో తలెత్తిన ఆందోళనల్లో 36మంది చనిపోగా.. 1500 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ శృతిమించి స్పందిస్తోంది. ఇప్పటికే ఉగ్రవాది బుర్హాన్ వనీని కశ్మీర్ నాయకుడిగా కీర్తిస్తూ.. అతని మృతిపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement