స‘లక్ష’ణ భారతం! | Sakshi
Sakshi News home page

స‘లక్ష’ణ భారతం!

Published Wed, Jun 11 2014 2:09 AM

స‘లక్ష’ణ భారతం!

భారత్‌లో పెరుగుతున్న లక్షాధికారుల కుటుంబాలు
 
 న్యూయార్క్: భారత్ స‘లక్ష’ణంగా వెలిగిపోతోంది! మనదేశంలో లక్షాధికారుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2013లో భారత్‌లో 1.75 లక్షల మంది లక్షాధికారుల కుటుంబాలు ఉన్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన 14వ వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న జాబితాలో మనదేశం 15వ స్థానంలో నిలిచింది. ‘రైడింగ్ ఏ వేవ్ ఆఫ్ గ్రోత్: గ్లోబల్ వెల్త్ 2014’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆ సంస్థ పలు విషయాలు వెల్లడించింది. 2013లో ప్రపంచ ప్రైవేటు ఆర్థిక సంపద 14.6 శాతం మేర పెరిగి 152 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు వివరించింది. లక్షాధికారుల కుటుంబాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో 2012లో 16వ స్థానంలో ఉన్న భారత్.. 2013కి వచ్చేసరికి ఒక స్థానం మెరుగుపరుచుకుందని పేర్కొంది.

 

2018 నాటికి భారతదేశం ఏడో సంపన్న దేశంగా నిలిచే అవకాశం ఉందని వెల్లడించింది. పది కోట్ల డాలర్లు(దాదాపు రూ.600 కోట్లు) అంతకంటే ఎక్కువ విలువ చేసే సంపద కలిగిన కుటుంబాలు భారత్‌లో గతేడాది 284 ఉన్నట్టు నివేదికలో తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 2012లో 1.37 కోట్ల మిలియనీర్ కుటుంబాలు ఉండగా, ఆ సంఖ్య 2013లో 1.63 కోట్లకు చేరుకుంది. అమెరికాలో అత్యధికంగా 71 లక్షల మిలియనీర్ కుటుం బాలున్నాయి. చైనాలో 2012లో 15 లక్షల లక్షాధికారి కుటుంబాలు ఉండగా, 2013లో ఆ సంఖ్య 24 లక్షలకు చేరుకుంది. అయితే జపాన్‌లో మాత్రం ఆ కుటుంబాల సంఖ్య 15 లక్షల నుంచి 12 లక్షలకు తగ్గింది. సాంద్రతపరంగా చూస్తే అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఖతార్‌లోనే ఎక్కువ. అక్కడ ప్రతి వెయ్యి కుటుంబాల్లో 175 కుటుంబాలు సంపన్నమైనవే.

Advertisement
Advertisement