వింత ఆలయాలు.. విచిత్ర ప్రసాదాలు! | Sakshi
Sakshi News home page

వింత ఆలయాలు.. విచిత్ర ప్రసాదాలు!

Published Fri, Sep 11 2015 10:41 AM

వింత ఆలయాలు.. విచిత్ర ప్రసాదాలు! - Sakshi

సాక్షి: ‘ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టది మరో దారి’ అనే సామెత గురించి మీకు తెలుసా.. తెలియకపోతే ఇప్పుడు చెప్పబోయే కొన్ని ప్రత్యేకమైన ఆలయాలు, అక్కడి సంప్రదాయాల గురించి తెలుసుకుంటే చాలు. దానర్థం మీకే తెలిసిపోతుంది. అందరూ పాటించే పద్ధతులు, ఆచారాలు పాటిస్తే మా ప్రత్యేకత ఏముందనుకున్నారో ఏమో కానీ.. కొన్ని ఆలయాల్లో చాలా చిత్రమైన పద్ధతులు పాటిస్తున్నారు. అలాంటి చిత్రమైన విధానాలు అవలంభించే ఆలయ విశేషాలు ఈ రోజు మీ కోసం..!

పంజాబ్‌లో వీసా దేవుడు..
చాలా మందికి విదేశీ ప్రయాణం ఒక కల. దాన్ని నెరవేర్చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా విదేశాలు వెళ్లాలంటే కావాల్సింది వీసా. అందుకే కాబోలు పంజాబ్‌లో సిక్కులు ఏకంగా విమాన దేవాలయం నిర్మించారు. ఇందులో దైవానికి వీసాదేవుడని పేరు కూడా పెట్టి ఆలయంలో పూజలు చేస్తున్నారు. అక్కడ భక్తులు బొమ్మ విమానాలనే కానుకలుగా సమర్పించుకుంటారు.

హవాయూ జహాజ్ గురుద్వారాగా పిలిచే ఈ సిక్కు దేవాలయం పంజాబ్‌లోని జలంధర్ తల్‌హాన్‌లో ఉంది. ఒకప్పుడు షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాగా పిలిచే ఈ పంజాబీ ఆలయాన్ని ప్రస్తుతం హవాయూ జహాజ్ గురుద్వారాగా పిలుస్తున్నారు. స్థానిక జాట్ కమ్యూనిటీ, దళిత వర్గాల ప్రజలు వందేళ్ల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ భక్తులకు విమానం బొమ్మనే ప్రసాదంగా ఇవ్వడం మరో విశేషం. ఇలా ఇస్తే వారికి త్వరగా వీసా లభిస్తుందని నమ్మకం. అంతేకాక విమాన ప్రయాణంలో ఎటువంటి అపదలూ లేకుండా రక్షణ కలుగుతుందని నమ్మకం.

విదేశీ ప్రయాణం కోరుకునేవారు ఈ గుడిలో విమానం బొమ్మ కూడా సమర్పించుకోవాలి. ఇక్కడి షాపుల్లో ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్‌వేస్, లుఫ్తాన్సా లాంటి విమానాల బొమ్మ నమూనాలు తయారు చేసి అమ్ముతారు. ఒక్కొక్కటి  రూ. 50 నుంచి 500 రూపాయల వరకు ఉంటాయి. ఇలా రోజూ కొన్ని వందల బొమ్మలు అమ్ముడవుతాయి.

నూడుల్సే ప్రసాదం..
ఇలాంటిదే కోల్‌కతాలోని టాంగ్రా గ్రామంలో ఉన్న కాళికాదేవి గుడి. అక్కడ చైనీయులు ఎక్కువగా నివసిస్తారు. 63 ఏళ్ల క్రితమే చైనీయులు ఇక్కడ కాళికాదేవి ఆలయం నిర్మించుకున్నారు. భక్తి శ్రద్ధలతో అన్ని పండుగలు జరుపుకుంటారు. కాకపోతే ఇక్కడ నైవేద్యమే వెరైటీ. నూడుల్స్, చూప్‌సుయ్, అన్నం, కొన్ని రకాల వెజిటబుల్ సూప్స్..లు అక్కడ పంచే ప్రసాదాలు.

ప్రత్యేక హనుమాన్..
గుజరాత్‌లోని గాంధీ పుట్టిన పోరుబందరును శ్రీకృష్ణుని బాల్య స్నేహితుడైన కుచేలుని పేరైన ‘సుధామ’ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణ, కుచేలులు కొలువై ఉన్న దేవాలయం ఉండటం విచిత్రం. కృష్ణుడు పాతాళంలో అహిరావణుడిని వధించిన రూపం ఇక్కడ ఉంది. ఇక్కడే ఏకాదశముఖ హనుమాన్ భారీ విగ్రహం ఉంది. స్వామికి 22 చేతులు, 11 శిరస్సులు ఉంటాయి.

రావణుడే ఆరాధ్య దైవం..
ఆ ఊరిలో రావణుడిని పూజించకపోతే  అరిష్టం దాపురిస్తుందని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు. మధ్యప్రదేశ్‌కి చెందిన ఉజ్జయిని జిల్లాలోని ఈ గ్రామం పేరు చిక్కాలి. సంప్రదాయం ప్రకారం ప్రతి చైత్ర నవరాత్రుల్లో దశమి నాడు ఈ గ్రామస్తులు రావణుడిని పూజిస్తుంటారు. ఈ సమయంలో రావణుడి గౌరవార్థం ఒక జాతర నిర్వహిస్తారు. ఆ రోజు ఊరి ప్రజలంతా రామ రావణ యుద్ధంపై నాటకం వేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో జనం వస్తుంటారు.

ఈ ప్రాంతంలో రావణుడిని మాత్రమే కొలుస్తారు. చాలా ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోందని గ్రామస్తులు అంటున్నారు ఒకసారి ఏదో కారణం చేత ఊరి ప్రజలు చైత్ర దశమి రోజు రావణుడికి జాతర చేయలేదట. ఆ తర్వాత అగ్ని ప్రమాదం సంభవించి ఊరంతా తగలబడిపోయిందట. రావణుడిని పూజించే గ్రామాలు ఇంకా ఉన్నప్పటికీ, పూజించక పోతే గ్రామం తగులబడిపోతుందని విశ్వసించే ఊరు మాత్రం ఇదొక్కటే!

ఇక్కడ స్నానం.. ఎంతో పుణ్యం..
గుజరాత్‌లోని ఖేడ్ జిల్లాలో అరేబియా సముద్ర తీరంలో ‘మహీనది’ సముద్రంలో కలిసే చోట శత్రుఘ్ని మాత ఆలయం ఉంది. అమావాస్య శనివారం ఇక్కడ స్నానం చేస్తే ఆరు సార్లు కాశీ యాత్ర చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ నవనాధులు కొలువై ఉండటం మరో విశేషం.

మద్యం ప్రసాదాలు..
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కాలభైరవుడి ఆలయంలో దేవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. నైవేద్యంగా ఉంచిన ఆ మద్యాన్ని సంవత్సరం పొడవునా భక్తులకు పంచిపెడతారు. తమ నగరాన్ని రక్షించే దేవుడిగా కాలభైరవుణ్ని వారు కొలుస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement