పండుగల వేళ.. చౌక రుణాల మేళా..!

4 Oct, 2013 00:33 IST|Sakshi
పండుగల వేళ.. చౌక రుణాల మేళా..!
న్యూఢిల్లీ: ఒకవైపు అధిక వడ్డీరేట్ల కారణంగా రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్న వారికీ, మరోవైపు డిమాండ్ లేక కుదేలవుతున్న పరిశ్రమకూ ఊరట కలిగించేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. పండుగ సీజన్‌లో ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ (టీవీలు, ఫ్రిజ్‌లు మొదలైనవి) వంటి వాటి కొనుగోళ్లకు బ్యాంకులు మరికాస్త చౌకగా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు  బడ్జెట్‌లో పేర్కొన్న దానికంటే అదనంగా పెట్టుబడులు సమకూర్చాలని నిర్ణయించింది. అయితే, ఈ పరిమాణం ఎంత మేర ఉంటుందన్నది వెల్లడి కాలేదు. ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 
 
 ‘బడ్జెట్‌లో పేర్కొన్న దానికన్నా (రూ.14,000 కోట్లు) ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ వంటి ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో డిమాండ్‌ను పెంచే విధంగా కాస్త తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇది తోడ్పడగలదు’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగలదని వివరించింది. వినియోగదారులకు.. ప్రత్యేకించి మధ్యతరగతి వర్గాలకు ఈ నిర్ణయం ఊరట కలిగించగలదని, అలాగే కంపెనీల సామర్థ్య విస్తరణకు, ఉపాధికి, ఉత్పత్తి పెరుగుదలకు కూడా తోడ్పడగలదని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ సమావేశంలో వివిధ రంగాల్లో రుణాల వృద్ధిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 
 
 నిర్దిష్ట రంగాలకు చౌక వడ్డీలపై రుణాలివ్వాల్సిన అవసరంపై చర్చించేందుకు త్వరలోనే పీఎస్‌యూ బ్యాంకుల అధినేతలతో సమావేశమవుతానని చిదంబరం చెప్పారు. బ్యాంకుల సామర్థ్యాన్నిబట్టి తక్కువ వడ్డీ రుణాలివ్వడం ఆధారపడి  ఉంటుందన్నారు. ఏయే రంగాల్లో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలిస్తే డిమాండ్ మెరుగుపడగలదన్నది బ్యాంకులు నిర్ణయిస్తాయని చిదంబరం చెప్పారు. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి తయారీ ఉత్పత్తులకు డిమాండ్‌ను కన్సూమర్ డ్యూరబుల్స్ విభాగం ప్రతిబింబిస్తుంది. మరోవైపు గతేడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో 6.8 శాతం వృద్ధి చెందిన ద్విచక్ర వాహనాల రంగం ఈసారి 0.72 శాతం మాత్రమే వృద్ధి చెందింది. 
 
 పరిశ్రమకు సానుకూలం..
 పండుగల సీజన్‌లో చౌక రుణాల పరిణామాన్ని స్వాగతిస్తున్నట్లు వాహన తయారీ సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ద్విచక్ర వాహనాల మార్కెట్ కోలుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోజనాన్ని కార్లు, ఇతర వాణిజ్య వాహనాలకు కూడా వర్తింపచేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేదని కిర్లోస్కర్ చెప్పారు. 
 నేడు ఆర్‌బీఐ బోర్డు సమావేశం ..రాయ్‌పూర్‌లో నేడు (శుక్రవారం) ఆర్‌బీఐ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంకులకు మరిన్ని పెట్టుబడులు సమకూర్చాలన్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
 కీలక ఆర్థిక పరిణామాలను చర్చించేందుకు ఆర్‌బీఐ బోర్డు ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమావేశమవుతుంటుంది. తాజాగా ఆర్థిక వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతానికి తగ్గడం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు అధిక స్థాయిలో 4.9 శాతంగా ఉండటం వంటి పరిస్థితుల్లో జరగబోయే ఆర్‌బీఐ బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఒక వైపున వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలంటుండగా.. గత నెల జరిగిన త్రైమాసిక మధ్యంతర పరపతి సమీక్షలో కూడా ఆర్‌బీఐ.. ద్రవ్యోల్బణ కట్టడికే ప్రాధాన్యమిస్తూ పాలసీ రేట్లను పావు శాతం పెంచిన సంగతి తెలిసిందే. రెండో త్రైమాసిక పాలసీ సమీక్ష ఈ నెల 29న జరగనుంది. 
 
మరిన్ని వార్తలు