రూపాయి చికిత్సకు త్వరలో మరిన్ని అస్త్రాలు! | Sakshi
Sakshi News home page

రూపాయి చికిత్సకు త్వరలో మరిన్ని అస్త్రాలు!

Published Sat, Aug 10 2013 2:05 AM

India unveils new steps to drain cash to support rupee

న్యూఢిల్లీ: నానాటికీ జారిపోతున్న రూపాయిని ఆదుకునేందుకు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కళ్లెం వేయడానికి ప్రభుత్వం మరిన్ని అస్త్రాలను ప్రయోగించనుంది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం శుక్రవారం ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వరంగ కంపెనీ(పీఎస్‌యూ)లకు విదేశీ రుణ సమీకరణ(ఈసీబీ) నిబంధనల్లో మరింత సడలింపు, ఎగుమతులను పెంచేవిధంగా ప్రోత్సాహకాలు, నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులకు అడ్డుకట్టవేయడం వంటి చర్యలు ఉండొచ్చని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ రావుతో కూడా చిదంబరం సంప్రదింపులు జరిపారు. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీతో పోలిస్తే 4.8 శాతం) ఎగబాకడం తెలిసిందే.
 
 క్యాడ్‌కు అడ్డుకట్టవేయడానికి వీలుగా నిత్యావసరంకాని వస్తువుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి(బడ్జెట్ విభాగం) రజత్ భార్గవ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే సూచించింది.  బొగ్గు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ వంటివాటిపై దృష్టిపెట్టనున్నారు. రూపాయి చికిత్సకోసం ఆర్‌బీఐ   ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) తగ్గింపు, ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేషన్‌కు అడ్డుకట్ట వంటి పలు చర్యలను ప్రకటించింది. అయినాసరే డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త కనిష్టాలను తాకుతూనే ఉంది. ఈ నెల 6న ఇంట్రాడేలో 61.80కు పడిపోయి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. దీంతో ప్రతి సోమవారం రూ.22వేల కోట్లవిలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్నట్లు ఆర్‌బీఐ  ప్రకటించడం గమనార్హం.

Advertisement
Advertisement