ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత్‌..! | Sakshi
Sakshi News home page

ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత్‌..!

Published Wed, Oct 5 2016 4:36 PM

ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత్‌..! - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ గెలుస్తాడేమోనన్న భయంతో భారత ప్రభుత్వం ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాం ముగిసిపోయేలోగా అగ్రరాజ్యంతో అనుకున్న ఒప్పందాలన్నింటినీ త్వరత్వరగా పట్టాలెక్కించాలని భావిస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే తరహాలో సైనిక నిఘాకు ఉద్దేశించిన ప్రిడేటర్‌ డ్రోన్‌ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతోపాటు పలు రక్షణ, అణు ప్రాజెక్టుల ఒప్పందాలు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది.

22 ప్రిడేటర్‌ గార్డియన్ డ్రోన్స్‌ను తమకు అమ్మాలని భారత్‌ గత జూన్‌లో అమెరికాను కోరింది. ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుతం సంప్రదింపులు పురోగతి సాధించాయని, ఒబామా పదవిలోంచి దిగిపోయేలోగా ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయ్యే అవకాశముందని భారత అధికార వర్గాలు తెలుపుతున్నాయి. రానున్న కొద్దినెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

మారిన మోదీ వ్యూహం!

భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఒబామా కూడా అమెరికా విదేశీ దౌత్యవ్యూహంలో ఘననీయమైన మార్పును తీసుకొచ్చి.. మధ్యప్రాచ్యం నుంచి ఆసియా మీదకు దృష్టి కేంద్రీకరించారు. భారత్‌కు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్న రష్యాను భారత్‌ పక్కనపెట్టేలా అమెరికా ఒప్పించగలిగింది. ఇందుకు ప్రతిగా భారత్‌కు అత్యున్నత సైనిక సాంకేతికత అందించడంతోపాటు బిలియన్‌ డాలర్లు విలువ చేసే అణురియాక్టర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతేకాకుండా మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్‌లో భారత్‌కు స్వభ్యత్వం వచ్చేలా చూసింది. దీంతో భారత్‌కు ప్రిడేటర్‌ డ్రోన్లు అమ్మేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కోసం అమెరికా రక్షణమంత్రి అష్టన్‌ కార్టర్‌ ఈ ఏడాది చివర్లో భారత్‌కు వచ్చే అవకాశముంది.

భయపెడుతున్న ట్రంప్‌ 'అమెరికా ఫస్ట్‌'

అమెరికా ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ తన విదేశీ విధానంలో 'అమెరికా ఫస్ట్‌' అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు. ఆయన ప్రకటనలు ఇటు భారత్‌లోనూ, అటు ఆసియాలోనూ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఆసియాకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఒబామా వ్యూహం నుంచి ట్రంప్‌ తప్పుకోవచ్చునని వినిపిస్తోంది. ట్రంప్‌ ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా మిత్రదేశాలు దక్షిణ కొరియా, జపాన్‌కు ఇస్తున్న రక్షణ సహకారంపై సందేహాలు రేకెత్తించారు. వారికి నేరుగా ఆయుధసాయం చేయడం కంటే.. సొంతంగా అవే అణ్వాయుధాలు రూపొందించుకునేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్‌ అధ్యక్షుడైతే అమెరికా విధానంలో ఆసియాకు ప్రాధాన్యం తగ్గొచ్చునని, ఇది పరోక్షంగా ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

Advertisement
Advertisement