డైమండ్స్, ప్లాటినం వైపు భారతీయుల దృష్టి | Sakshi
Sakshi News home page

డైమండ్స్, ప్లాటినం వైపు భారతీయుల దృష్టి

Published Thu, Oct 31 2013 1:19 AM

డైమండ్స్, ప్లాటినం వైపు భారతీయుల దృష్టి

న్యూఢిల్లీ: బంగారం ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారతీయులు వైట్‌గోల్డ్, డైమండ్, ప్లాటినం ఆభరణాలవైపు దృష్టి సారిస్తున్నారు. పండుగల సీజన్‌లో ఈ ధోరణి కనబడుతున్నట్లు ఒక సర్వే పేర్కొంది. దేశీయ వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా 76 శాతం ఆభరణాల వర్తకులు సైతం ప్లాటినం ఆధారిత డైమండ్ ఆభరణాల వైపు దృష్టి పెడుతున్నట్లు సర్వే పేర్కొంది. హైదరాబాద్‌సహా 350 ఆభరణాల మార్కెట్లను సర్వే అధ్యయనం చేసింది. బంగారం, వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల వినియోగదారులు ప్లాటినం, డైమండ్ ఆధారిత ఆభరణాలపై దృష్టి సారిస్తున్నట్లు అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. వార్షిక ప్రాతిపదికన డైమండ్, డైమండ్ ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది 25 శాతం పెరిగినట్లు సర్వే తెలిపింది.
 
 బంగారం  టారిఫ్ విలువ పెంపు...
 కాగా  కస్టమ్స్ సుంకాల విధింపునకు ప్రాతిపదిక అయిన బంగారం దిగుమతుల టారిఫ్ విలువను ప్రభుత్వం బుధవారం పెంచింది. దీనితో 10 గ్రాములకు ఈ ధర 418 డాలర్ల నుంచి 442 డాలర్లకు చేరింది. ఐదుశాతం పైగా పెరిగిన ఈ విలువ ప్రభావం మార్కెట్‌పై పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా వెండి టారిఫ్ విలువ మాత్రం యథాపూర్వం కేజీకి 699డాలర్లుగా కొనసాగనుంది. సాధారణంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఈ ధరలను ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ సమీక్షిస్తుంటుంది. అంతర్జాతీయ ధరలు, దేశీయ డిమాండ్ వంటి అంశాలకు అనుగుణంగా విలువలో మార్పులు చేస్తుంది.

Advertisement
Advertisement