తొలి లాభాలు ఆవిరి | Sakshi
Sakshi News home page

తొలి లాభాలు ఆవిరి

Published Thu, Jan 30 2014 1:27 AM

తొలి లాభాలు ఆవిరి

ప్రపంచ మార్కెట్ల సానుకూలతతో భారత్ స్టాక్ సూచీలు బుధవారం ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాలను ముగింపు సమయంలో కోల్పోయాయి. ఫలితంగా వరుసగా నాలుగోరోజూ నష్టాలతో ముగిసాయి. తొలుత పాజిటివ్‌గా ప్రారంభమైన  బీఎస్‌ఈ సెన్సెక్స్ 20,828 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. అయితే భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మిస్‌కావడంతో సెన్సెక్స్ లాభాలను కోల్పోయి 36 పాయింట్ల నష్టంతో 20,647 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

నాలుగు రోజుల్లో బీఎస్‌ఈ సూచి 726 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇదేబాటలో 6,170 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 6 పాయింట్ల నష్టంతో 6,120 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ విషయమై బుధవారం అర్థరాత్రి వెల్లడించే నిర్ణయం పట్ల ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించారని, దాంతో తగిన కొనుగోలు మద్దతు లభించలేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. జనవరి డెరివేటివ్ సిరీస్ మరో రోజులో ముగియనున్నందున అమ్మకాల ఒత్తిడి ఏర్పడినట్లు ఆ వర్గాలు వివరించాయి.

మెటల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సేసా స్టెరిలైట్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 2 శాతం మేర నష్టపోయాయి. భారతి ఎయిర్‌టెల్ 1 శాతం క్షీణించింది. ఫార్మా షేర్లు ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మా, సిప్లాలు 1.5-3.5 శాతం మధ్య పెరిగాయి. మారుతి సుజుకి 6.5 శాతం, బీహెచ్‌ఈఎల్, బీపీసీఎల్‌లు 4 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 250 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 17 కోట్లు వెనక్కుతీసుకున్నాయి.

Advertisement
Advertisement