ఇండిగో ఐపీఓకు రిటైల్ ఇన్వెస్టర్లు దూరం! | Sakshi
Sakshi News home page

ఇండిగో ఐపీఓకు రిటైల్ ఇన్వెస్టర్లు దూరం!

Published Fri, Oct 30 2015 1:40 AM

ఇండిగో ఐపీఓకు రిటైల్ ఇన్వెస్టర్లు దూరం!

ఎఫ్‌ఐఐల మద్దతుతో గట్టెక్కిన ఇష్యూ    6 రెట్లు ఓవర్ సబ్‌స్రిప్షన్

ముంబై: ఇండిగో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) 6 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. గురువారం ముగిసిన ఈ ఐపీఓ ద్వారా ఇండిగో మాతృకంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ రూ.3,018 కోట్లు సమీకరించనున్నది. మూడేళ్లలో అతి పెద్దదైన ఈ ఐపీఓకు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ లభించలేదు. అయితే సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కనిపించింది. ఈ ఐపీఓ ద్వారా 3 కోట్ల షేర్లను కంపెనీ జారీ చేయనున్నది. వీటికి రూ.18 వేల కోట్ల విలువైన 18.49 కోట్ల షేర్ల కోసం  బిడ్‌లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్)కు కేటాయించిన వాటాకు మంచి స్పందన లభించింది. ఈ వాటా 18 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది.

కానీ ఈ విభాగంలో అధిక శాతం బిడ్స్ విదేశీ సంస్థల నుంచే వచ్చాయని, భారత్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్స్ నుంచి 0.48 శాతమే బిడ్స్ వచ్చినట్లు సమాచారం. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరి 3.5 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఈ విభాగంలో అధికంగా బిడ్ చేసిన హైనెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్‌ఎన్‌ఐలు)ల్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా వంటి వారున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు వాటా 90 శాతం, ఉద్యోగుల కేటగిరి వాటా 12 శాతం చొప్పున  మాత్రమే  సబ్‌స్క్రైబ్ అయ్యాయి. రూ.4,000 కోట్ల భారతీ ఇన్‌ఫ్రాటెల్ ఐపీఓ తర్వాత మూడేళ్ల కాలంలో ఇదే అతిపెద్ద ఐపీఓ.  వారెన్ బఫెట్‌తో సంబంధం ఉన్న ఆకేసియా పార్ట్‌నర్స్‌తో సహా వివిధ విదేశీ సంస్థలు ఈ విమానయాన షేర్లకు బిడ్ చేసినట్లు సమాచారం. ఈ ఐపీఓకు రూ.700-765ను ప్రైస్‌బాండ్‌గా కంపెనీ నిర్ణయించింది.
 
 
 

Advertisement
Advertisement