రామ్‌ కుమార్‌కు ఝలక్ | Sakshi
Sakshi News home page

రామ్‌ కుమార్‌కు ఝలక్

Published Fri, Jul 8 2016 8:36 AM

రామ్‌ కుమార్‌కు ఝలక్ - Sakshi

చెన్నై: ఇన్ఫోసిస్ స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్‌కుమార్‌కు అతని న్యాయవాది కృష్ణమూర్తి ఝలక్ ఇచ్చారు. కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గత నెల 24వ తేదీన చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యోదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు  రామ్‌కుమార్‌ను పోలీసులు ఈనెల 1వ తేదీన తిరునెల్వేలీలోని అతని ఇంటిలో అరెస్ట్ చేశారు. హత్యకేసుతోపాటూ పోలీసులు పట్టుకునే సమయంలో గొంతు కోసుకున్నందున ఆత్మహత్యాయత్నం కేసును కూడా రామ్‌కుమార్‌పై నమోదు చేశారు.

తన ప్రేమను నిరాకరించినందుకే స్వాతిని హతమార్చినట్లు తిరునెల్వేలీలో పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రామ్‌కుమార్ అంగీకరించినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ టీకే రాజేంద్రన్ మీడియా సమావేశంలో ప్రకటించారు. చెన్నై రాయపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామ్‌కుమార్ వద్ద న్యాయమూర్తి స్వయంగా వచ్చి విచారించి ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించారు. రామ్‌కుమార్ న్యాయవాది మహేంద్రన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ దశలో స్వాతి హత్యతో తనకు ఎంటువంటి సంబంధం లేదని అకస్మాత్తుగా ఫ్లేటు ఫిరాయించాడు. అసలు నిందితుడిని రక్షించేందుకు తనపై హత్యకేసు బనాయించారని బెయిల్ పిటిషన్‌లో రామ్‌కుమార్ వాదించాడు. పిటిషన్ దారుని అనుమతి లేకుండానే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వ న్యాయవాది ఎమ్‌ఎల్ జగన్ బుధవారం నాటి విచారణ సమయంలో కోర్టుకు విన్నవించాడు.

అయితే రామ్‌కుమార్ తరపు మరో న్యాయవాది కృష్ణమూర్తి మాట్లాడుతూ పిటిషన్‌దారుని అనుమతితోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని బదులిచ్చాడు. ఇదిలా ఉండగా రామ్‌కుమార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళా న్యాయవాదులు మూకుమ్మడిగా కోర్టుకు వచ్చి బెయిల్ మంజూరు చేయరాదని న్యాయమూర్తికి విన్నవించుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఈనెల 15వ తేదీకి వాయిదాపడింది. రామ్‌కుమార్ పట్ల ప్రజలంతా ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో అతనికి అండగా ఇద్దరు న్యాయవాదులు నిలబడటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

తప్పుకున్న కృష్ణమూర్తి:

స్వాతిని తానే హత్య చేసినట్లు మొదట అంగీకరించి మళ్లీ నిరాకరించిన రామ్‌కుమార్ అదే తీరులో తన న్యాయవాది కృష్ణమూర్తి చేతిలో కంగుతిన్నాడు. బుధవారం పూర్తిగా రామ్‌కుమార్‌కు బాసటగా నిలిచిన కృష్ణమూర్తి నిన్న ఉదయం అకస్మాత్తుగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. రామ్‌కుమార్ కేసు వాదన నుంచి తప్పుకుంటున్నట్లుగా ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు. యువ న్యాయవాదులకు తర్ఫీదు ఇచ్చేందుకు మాత్రమే తాను న్యాయస్థానాలకు హాజరవుతున్నానని, తన నుంచి సుమారు 400 మంది యువ న్యాయవాదులు పని నేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. స్వాతి హత్యకేసులో నిందితుడైన రామ్‌కుమార్ తరఫున తాను నేరుగా నియమించిన న్యాయవాదిని కాదని, మరో యువ న్యాయవాది విజ్ఞప్తి మేరకు వాదించేందుకు వచ్చానని వివరించారు.

అయితే రామ్‌కుమార్ జామీను పిటిషన్ వ్యహారంలో తనను తప్పుగా చిత్రీకరించారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కోర్టులో వాదిస్తున్నానని, నిందితుడు రామ్‌కుమార్ సైతం అదే కేటగిరికి చెందిన వాడు కావడంతో వాదించానని వివరించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తాను, తన జూనియర్ సైతం రామ్‌కుమార్ కేసు నుండి తప్పుకుంటున్నట్లు కృష్ణమూర్తి స్పష్టం చేశారు. కేసును విచారిస్తున్న పోలీసులకు రామ్‌కుమార్ ఝలక్ ఇవ్వగా, రామ్‌కుమార్‌కు న్యాయవాది ఝలక్ ఇచ్చారు.

Advertisement
Advertisement