ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ అప్రమత్తం: డీజీపీ బి.ప్రసాదరావు | Sakshi
Sakshi News home page

ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ అప్రమత్తం: డీజీపీ బి.ప్రసాదరావు

Published Wed, Nov 27 2013 2:02 AM

ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ అప్రమత్తం: డీజీపీ బి.ప్రసాదరావు

ప్రధాని హెచ్చరికల నేపథ్యంలో డీజీపీ ఆదేశాలు
 సాక్షి, హైదరాబాద్: ఏ సమయంలోనైనా ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందనే కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటెలిజెన్స్, ఆక్టోపస్ విభాగాలను అప్రమత్తం చేశారు. దేశంలో ఐఎస్‌ఐ ఉగ్రవాదుల కదలికలు సాగుతున్నాయని, ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలను టార్గెట్‌గా చేసుకుని విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం ఉందని రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
 
 ఈ నేపథ్యంలో డీజీపీ బి.ప్రసాదరావు ప్రధాని చేసిన హెచ్చరికల గురించి ఆపరేషన్స్ విభాగం డీజీపీ జేవీ రాముడు, ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి, శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్‌కే కౌముదిలతో చర్చించి తగిన ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రంలో ఉగ్రవాద, మతోన్మాద కార్యకలాపాలపై కన్నువేసే కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం మరింత అప్రమత్తంగా మెలగాలని ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలంతో సహా ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

 

ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక విభాగం ఆక్టోపస్ కమాండో దళానికి కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి రోజూ అప్రమత్తంగా ఉండటమే గాక అనుమానిత ప్రదేశాలు, ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్న ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని కూడా ఆదేశాలు అందాయి. ఉగ్రవాద నిరోధక విభాగాలే గాక శాంతి భద్రతల విభాగం పోలీసులూ నిర్లక్ష్యంగా ఉండరాదని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు అంతర్గత సర్క్యులర్‌ను జారీచేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement