వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయ్ | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయ్

Published Thu, Mar 26 2015 1:31 AM

వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయ్

ఇన్‌ఫ్రాలో మరిన్ని పెట్టుబడులు
డిజిన్వెస్ట్‌మెంట్‌కు పీఎస్‌యూల లిస్టు సిద్ధం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

 
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించాలంటే వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గగలవన్నారు. అయితే, తగ్గుదల ఎంత మేర ఉంటుందనే దానిపై నిర్ణయాధికారం రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)దేనని బుధవారం ఇన్వెస్టర్లతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే నెల 7న ఆర్‌బీఐ వార్షిక పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కరెన్సీ మారక విలువల నియంత్రణను ఆర్‌బీఐ సమర్థంగా నిర్వహిస్తోందని, దీని గురించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆరుణ్ జైట్లీ చెప్పారు.

జీఎస్‌టీకి త్వరలో మోక్షం..  

మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను మరింతగా పెంచనున్నట్లు తెలిపారు. వివిధ కారణాలతో  77 హైవే ప్రాజెక్టులు నిల్చిపోగా.. సమస్యలను పరిష్కరించడంతో 24 ప్రాజెక్టులు మళ్లీ పట్టాలపైకి ఎక్కాయని ఆయన చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చే దిశగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు.  విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో రక్షణ రంగంలోనూ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయని చెప్పారు. అలాగే వస్తు, సేవల పన్నుల విధానాన్ని (జీఎస్‌టీ) త్వరలో అమల్లోకి తేగలమని ఆయన తెలిపారు. ఇక, భూసేకరణ చట్టం గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనమే చేకూరుతుందని మంత్రి తెలిపారు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో వాటాలను వ్యూహాత్మకంగా విక్రయించనున్న ప్రభుత్వ సంస్థల (పీఎస్‌యూ) జాబితాను కేంద్రం సిద్ధం చేసిందని జైట్లీ తెలిపారు. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకపోయినప్పటికీ... గణాంకాల పరంగా భారీ స్థాయిలోనే డిజిన్వెస్ట్‌మెంట్ జరిగినట్లేనని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో ఓఎన్‌జీసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్‌ఈఎల్), తదితర సంస్థలు ఉన్నాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement