అధికారులపై సీఎం యోగి కొరడా..! | Sakshi
Sakshi News home page

అధికారులపై సీఎం యోగి కొరడా..!

Published Thu, May 25 2017 8:39 AM

అధికారులపై సీఎం యోగి కొరడా..!

షహరాన్‌పూర్‌లో సడలని ఉద్రిక్తత.. మొబైల్‌ ఇంటర్నెట్‌ బంద్‌!

షహరాన్‌పూర్‌: దళితులు, రాజ్‌పుత్‌ వర్గాల మధ్య తలెత్తిన హింసాత్మక ఘర్షణలను అదుపు చేయడంలో విఫలమైన అధికారులపై ఉత్తరప్రదేశ్‌ సర్కారు కొరడా ఝళిపించింది. పశ్చిమ యూపీలోని షహరాన్‌పూర్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులను, ఓ ఐఏఎస్‌ అధికారిని సస్పెండ్‌ చేసింది. షహరాన్‌పూర్‌లో దళితులు, రాజ్‌పుత్‌ ఠాకూర్ల మధ్య కులవైరం తలెత్తి గత నెల రోజులుగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. జిల్లాలోని షబ్బీర్‌పూర్‌ గ్రామంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి సభ నిర్వహించగా.. ఆ సభలో పాల్గొన్న దళితుడు ఒకరు బుధవారం హత్యకు గురయ్యాడు. మరో 20 మంది గాయపడ్డారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత మరింత తీవ్రస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సీనియర్‌ ఎస్పీ ఎస్సీ దుబేను, జిల్లా కలెక్టర్‌ ఎన్పీ సింగ్‌ను యోగి సర్కారు సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా జిల్లా డీఐజీ జేకే సాహిపై కూడా వేటు వేసింది.

షహరాన్‌పూర్‌లో హింసకు కారణమైన ప్రతి ఒక్కరిపైనా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని యోగి సర్కారు హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో, ఇంటర్నెట్‌లో ప్రచారమవుతున్న వదంతులు, విద్వేష ప్రసంగాలను ప్రజలు నమ్మవద్దని, సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని సీఎం యోగి కోరారు. అంతేకాకుండా షహరాన్‌పూర్‌లో విద్వేష వదంతులను అడ్డుకునేందుకు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను తాత్కాలికంగా రద్దుచేశారు.

రాజ్‌పుత్‌ వంశస్తుడైన మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా ఈ నెల 5న ఠాకూర్లు షబ్బీర్‌పూర్‌లో నిర్వహించిన ఊరేగింపు పట్ల దళితులు అభ్యంతరం  వ్యక్తం చేయడంతో ఘర్షణ మొదలైంది. ఇక్కడ ఇరు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో ఓ వ్యక్తి మరణించగా, 15 మంది గాయపడ్డారు. అప్పటినుంచి జిల్లాలో ఇరువర్గాల మధ్య దాడులు, ఘర్షణలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement
Advertisement