ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక రైళ్లు | Sakshi
Sakshi News home page

ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక రైళ్లు

Published Fri, Aug 14 2015 12:39 AM

ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక రైళ్లు - Sakshi

* అక్టోబర్‌లో ‘పవిత్ర గంగా యమున యాత్ర’
* అన్ని సదుపాయాలతో ప్రత్యేక ప్యాకేజీలు
* అక్టోబర్ 10 నుంచి 19 వరకు పర్యటన

సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ఆహార, పర్యాటక సంస్థ (ఐఆర్‌సీటీసీ) ఆధ్యాత్మిక రైళ్లకు శ్రీకారం చుట్టింది. ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్ధన మందిరాలు, ఆధ్యాత్మిక, పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శన కోసం ప్రవేశపెట్టిన ఈ రైళ్లు  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అక్టోబర్  నుంచి అందుబాటులోకి రానున్నాయి.

‘పవిత్ర గంగా యమున యాత్ర’ పేరుతో అక్టోబర్ 10న  హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల  మీదుగా ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల గుండా వెళ్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య గురువారం సమావేశంలో వెల్లడించారు. అక్టోబర్ నుంచి ప్రతి 15 రోజులకు ఒకటి చొప్పున ఈ రైళ్లు నడుస్తాయన్నారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, చెన్నైల నుంచి ఈ రైళ్లు   పర్యటనకు బయలుదేరాయని, సికింద్రాబాద్ నుంచి తొలి రైలు అక్టోబర్ 10న బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ స్టేషన్‌ల మీదుగా 12న గయకు చేరుతుంది.  

అక్కడి నుంచి వారణాసి, ప్రయా గ, హరిద్వార్, ఢిల్లీ, మధుర, ఆగ్రాలలో పర్యటించి అక్టోబర్ 19న తిరిగి సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ  పర్యటనలో కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణ, త్రివేణి సంగమ స్నానం, గంగా స్నానం, హరిద్వార్‌లో మానసాదేవి మందిరం, ఢిల్లీలో కుతుబ్ మీనార్, లోటస్ టెంపుల్, మధురలో శ్రీకృష్ణ జన్మభూమి తదితర దర్శనీయ స్థలాలుంటాయి.  10 రోజుల పాటు సాగే  ఈ పర్యటనలో  భోజనం, వసతి, రోడ్డు రవాణా సదుపాయాలనూ ఐఆర్‌సీటీసీయే చూస్తుంది. యాత్రికులకు బీమా సదుపాయం కూడా ఉంటుంది.
 
పలురకాల ప్యాకేజీలు: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 7  కోచ్‌లతో రూపొందించిన ఈ ఆధ్యాత్మిక రైల్లో 560 మంది యాత్రికులు అవకాశం ఉంటుంది. స్లీపర్‌లో ఒక్కొక్కరికి రూ.9,100, థర్డ్ ఏసీలో రూ.19,700, సెకెండ్ ఏసీలో రూ.26,500 చొప్పున ప్యాకేజీలు న్నాయి. ‘పవిత్ర గంగా యమున’ పర్యటనకు వెళ్లదలుచుకున్న ప్రయాణికులు తమ బెర్తులను బుక్ చేసుకొనేందుకు 040-27702407, 9701360648, 9701360615, 9701360620 ఫోన్ నంబర్‌లకు సంప్రదించవచ్చు.
 
దశలవారీగా పర్యటనలు: పవిత్ర గంగా యమున యాత్ర స్పెషల్ పర్యటన రైలు  నడుపనున్నట్లుగానే సూఫీ సర్క్యూట్, సిఖ్‌తక్, బౌద్ధపుణ్యక్షేత్రాలు వంటి వివిధ యాత్ర రైళ్లు కూడా ప్రవేశపెట్టనున్నారు. దక్షిణ దేశయాత్ర, నవజ్యోతిర్లింగ యాత్ర, ఓనమ్ స్పెషల్, మూకాంబిక స్పెషల్ ట్రైన్,శక్తిపీఠ్  వంటి  రైళ్లు  వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరనున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement