సుష్మా తప్పుకుంటున్నారా? | Sakshi
Sakshi News home page

సుష్మా తప్పుకుంటున్నారా?

Published Tue, Jun 16 2015 1:56 PM

సుష్మా తప్పుకుంటున్నారా? - Sakshi

న్యూఢిల్లీ: విదేశాంగమంత్రి పదవి నుంచి తప్పుకోవడానికి సుష్మా స్వరాజ్ మొగ్గు చూపారా..? వారం రోజుల క్రితమే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి ఆమె సిద్ధపడ్డారా..? అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. లలిత్ మోడీ వీసా వివాదం మీడియాలో రావడానికి ముందే సుష్మా స్వరాజ్ తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. అయితే ఆ ప్రతిపాదనను బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు సమాచారం. లలిత్ మోడీ ట్రావెలింగ్ డాక్యుమెంట్లకు సంబంధించిన వ్యవహారం మీడియాలో లీక్ కాకముందే అందుకు సంబంధించిన వివరాలను సుష్మా ప్రధాని మోదీకి తెలియచేసినట్లు తెలుస్తోంది.

అంతకుముందే ఆమె రాజీనామాకు సిద్ధపడ్డారని, అయితే ఆర్ఎస్ఎస్ జోక్యంతో ఆ ప్రతిపాదన వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. మోదీతో సుష్మా భేటీ తర్వాత బీజేపీ, ఆర్ఎస్ఎస్ అత్యున్నతస్థాయి నేతల మధ్య భేటీ జరిగిందని, ఆ సమావేశంలోనే లలిత్ మోదీ వీసా వివాదంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేశారని సమాచారం. ఈ పరిణామాల తర్వాతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో పాటు శివసేన కూడా సుష్మాకు మద్ధతుగా నిలిచిందని తెలుస్తోంది.

ఇక లలిత్ మోడీ వీసా వివాదం రోజురోజుకూ ముదురుతున్న నేపథ్యంలో సుష్మా స్వరాజ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని సుష్మా ఇంటి వద్ద నిన్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సెక్యూరిటీని పటిష్టం చేసిన అధికారులు అక్కడ నిఘాను కూడా పటిష్టం చేశారు.

మరోవైపు సుష్మా-లలిత్‌ మోడీ వీసా వివాదంపై కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను ఉద్ధృతం చేసింది. ఇప్పటికే సుష్మా రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ శ్రేణులు తాజాగా బెంగళూరులో ఆందోళన చేపట్టారు. స్థానిక నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు... సుష్మా, లలిత్‌మోడీ, నరేంద్రమోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. సుష్మా వెంటనే మంత్రి పదవికి రాజనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement